కేంద్రం మస్తిచ్చింది…

– మోడీకి పాలాభిషేకం చేయాలి
– తీర్మానానికి వ్యతిరేకంగా బీజేపీ వాకౌట్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రధాని నరేంద్రమోడీ గడచిన పదేండ్లలో రాష్ట్రానికి లక్షల కోట్ల నిధులు ఇచ్చారనీ, అందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఆయనకు పాలాభిషే కం చేయాలన బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వ రరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కేంద్ర నిధులతో కొనసాగుతున్న అనేక ప్రాజెక్టులు ఉన్నాయని చెప్పారు. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. రీజినల్‌ రింగ్‌రోడ్‌ కోసం కేంద్రం రూ.26వేల కోట్లు ఇచ్చిందనీ, తాగునీటి కోసం ఉద్దేశించిన అమృత్‌ పధకం ద్వారా రూ.3,500 కోట్లు ఇచ్చారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పేరుతో అవినీతి చేస్తే, మూసీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ పేరుతో కాంగ్రెస్‌ మరో లక్ష కోట్ల అవినీతికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కేవలం బీజేపీని బదనాం చేయడం కోసమే కేంద్రంపై విషం చిమ్ముతున్నారని అన్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌లో కేంద్రీయ విద్యాలయాలను మంజూరు చేస్తే, ఇప్పటి వరకు భూములు చూపలేదని ఆక్షేపించారు. డిక్లరేషన్ల పేరుతో సాధ్యంకాని హామీలు ఇచ్చి, అవి అమలు చేయడం చేతకాక, కేంద్రంపై నిందలు వేస్తున్నారని అన్నారు. కేంద్రం అన్యాయం చేసిందని భావిస్తే కాంగ్రెస్‌పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు రాజీనామా చేసి, మళ్లీ గెలవాలని సవాలు విసిరా రు. ఈ వ్యాఖ్యలపై శాసనసభ విప్‌ ఆది శ్రీనివాస్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేశారు. దీనితో సభలో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు రాజీనామా చేస్తే, కేంద్రం దిగి వస్తుందని, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని వారు అన్నారు. అమృత్‌ స్కీం ద్వారా కేంద్రం ఇచ్చిన రూ.3,500 కోట్లను గుత్తేదార్లు పంచుకున్నారని బీజేపీ శాసనసభాపక్షనేత మహేశ్వరరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఈ గొడవ మధ్యే మహేశ్వరరెడ్డి సభ నుంచి వాకట్‌ చేస్తున్నామని చెప్పి సహచర ఎమ్మెల్యేలతో కలిసి బయటకు నుంచి వెళ్ళిపోయారు.