తొమ్మిదేళ్లుగా ప్రయత్నం.. కనికరించని కేంద్రం

– ఏర్పాటు కాని మరమగాల క్లస్టర్
– కేంద్రం నిర్ణయం పై నేతన్నల ఎదురుచూపు
నవతెలంగాణ – సిరిసిల్ల
రాష్ట్రంలో మరమగ్గాల వస్త్రోత్పత్తి పరిశ్రమలు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రథమ స్థానం. ఇక్కడి పరిశ్రమలో ఉత్పత్తి అవుతున్న వస్త్రం జాతీయ అంతర్జాతీయ మార్కెట్ లో పోటీ పడలేక పోతుంది దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం అవసరం. సిరిసిల్లలో సీపీసీడీఎస్( సమగ్ర పవర్ లూమ్ క్లస్టర్ డెవలప్మెంట్ స్కీం) కింద మెగా పవర్ లూమ్ క్లస్టర్ ఏర్పాటు 9 ఏళ్లుగా జరుగుతున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. గత ప్రభుత్వంలో అప్పటి మంత్రి కే తారక రామారావు కేంద్ర జౌళి శాఖ అప్పటి మంత్రి స్మృతి ఇరానీని కలిసి అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేదు. కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 35 వేల మరమగ్గాలు ఉండగా వాటిలో 29 వేలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉన్నాయి. వీటిపై గతంలో రోజుకు13.20 లక్షల మీటర్ల పాలిస్టర్,6.60 లక్షల మీటర్ల కాటన్ వస్త్రోత్పత్తి జరుగుతుంది. జిల్లా కేంద్రంలో 80 శాతం మంది వస్త్రోత్పత్తి పరిశ్రమలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. దేశవ్యాప్తంగా వస్త్రోత్పత్తి రంగంలో వస్తున్న  ఆధునికతను ఇక్కడి పరిశ్రమ వర్గాలు అందిపుచ్చుకోలేక పోతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా మరమగ్గాల ఆధునికీకరణ, నైపుణ్యం, మౌలిక వసతుల కొరత అధికంగా ఉంది. ఈ సమస్యలతో దేశంలోని మిగతా ప్రాంతాల్లోని మరమగ్గాల పరిశ్రమతో ఇక్కడి పరిశ్రమ పోటీ పడలేక పోతుంది. ఫలితంగా జిల్లాలో ఉత్పత్తి అవుతున్న వస్త్రం జాతీయ అంతర్జాతీయ స్థాయి మార్కెట్లలో గుర్తింపునకు నోచుకోవడం లేదు. సొంతంగా తయారుచేసి ఉత్పత్తులు బహిరంగ మార్కెట్ లో ఇతర బ్రాండ్లతో పోటీ పడలేకపోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో నుంచి బయటపడే అవకాశం ఉంది.
– సీపీసీడీఎస్ ఏర్పాటు చేస్తే..
రాష్ట్రంలో చేనేత మరమగ్గాల కార్పొరేషన్లు వేరువేరుగా ఏర్పాటు చేశారు. సీపీసీడీఎస్ ఏర్పాటుకు గత ప్రభుత్వం 993.65 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికను రూపొందించింది మొదటి విడత కేంద్రం వాటాగా 49.84 కోట్లు కేటాయించాలని అప్పటి మంత్రి కేటీఆర్ అప్పటి కేంద్ర జౌళి  శాఖ మంత్రి స్మృతి ఇరానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో మరమగాల పరిశ్రమపై ఆధారపడ్డ వేలాది కుటుంబాలకు శాశ్వత ప్రయోజనం కలుగుతుంది. మహారాష్ట్రలోని ఈరోడ్, బివండీ ప్రాంతాల్లో కేంద్రం 2009-10, 2012-14 లో సీపీసీడీఎస్ ను ఏర్పాటు చేసింది. ఆయా ప్రాంతాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో వస్త్రోత్పత్తి అనుబంధ పరిశ్రమలు విస్తరించాయి. ఇందులో చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు లభిస్తాయి. ఫలితంగా పరిశ్రమ సామర్థ్యం పెరుగుతుంది. అనుబంధంగా అత్యాధునిక ప్రాసెసింగ్, సైజింగ్ ,నూలు ,డయింగ్, మార్కెటింగ్ కేంద్రం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వస్త్రోత్పత్తి రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఇక్కడి మరమగాలను ఆధునికరించడం ,విపనిలో నూలు, రసాయనాల ధరలపై స్థానికంగా యజమానులకు, కూలీలకు అవగాహన కల్పించడంలో సిపిసిడిఎస్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో తొలి టెక్స్టైల్ పార్కు సిరిసిల్లలోనే ఉంది. కేంద్రం అనుమతిస్తే ఇందులో ప్రత్యేకంగా స్థలం కేటాయించనున్నారు. దీనికోసం పెద్దూరు సమీపంలోని అపేరాల్ పార్క్, గ్రూపు వర్క్ షెడ్ పక్కన అవసరమైన స్థలం ఉంది. వస్త్రోత్పత్తి పరిశ్రమకు సేవలందించిన అన్ని రకాల పరిశ్రమలు ఒకేచోట ఉంటాయి .వేలాది మంది కార్మికులకు ఉపాధి భద్రత ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సిరిసిల్ల నేతన్నలకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉంది.