మణిపూర్‌లో జాతి ఘర్ష ణలు ప్రజ్వరిల్లి ఇప్పటికి పదహారు నెలలు గడచిపోయాయి. వీటిలో 250 మందికి పైగా మరణించగా మరి ఎంతోమంది హింసాకాండలో గాయపడ్డారు. 60వేల మంది ప్రజలు నివాసాలు కోల్పోయి శరణార్థులుగా బతుకుతున్నారు. కేంద్ర ప్రభుత్వం, బిజెపి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘర్షణకు దారి తీసిన మౌలిక సమస్యలను పరిష్కరిం చడంలో ఘోరంగా విఫలమైనాయి. పరిస్థితి మరింత దిగజారి జాతి విభజన మరింత తీవ్రం కావడానికి దారి తీశాయి. కేవలం కుకీ ప్రాబల్యం గల కొండ ప్రాంతాలకూ, మెయితీలు ప్రధానంగా ఉన్న లోయ ప్రాంతానికి మధ్య ఒక రక్షిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయడానికే 60వేల మంది కేంద్ర పోలీసు బలగాలు పనికి వస్తున్నాయి. గత 15 రోజుల్లో పరిస్థితి గణనీయంగా దిగజారింది. పశ్చిమ జిల్లాలో మెయితీలు ప్రధానంగా వుండే ప్రాంతం కౌట్రక్‌లో సెప్టెంబర్ ఒకటవ తేదీన ఇద్దరు వ్యక్తులు చంపివేయబడగా డ్రోన్ దాడిలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ దాడి వెనుక కొందరు కుకీ తీవ్రవాదులు ఉన్నారని సందేహాలు న్నాయి. అలాగే మరో ప్రాంతంలో ఒక రాకెట్ దాడి కూడా జరిగింది. సెప్టెంబర్ ఆరున జిరిబాం జిల్లాలో ముగ్గురు సాయుధ తీవ్రవాదులతో సహా ఐదుగురు చంపబడ్డారు. రెండు రోజుల తర్వాత పశ్చిమ ఇంపాల్ జిల్లాలోని మెయితీ ప్రాంతం దాటి మధ్యంతర ప్రదేశంలోకి ప్రవేశించినందుకు కుకీ మూలాలు గల ఒక మాజీ సైనిక ఉద్యోగిని కొట్టి చంపారు.అసలు సమస్యవాస్తవం ఏమంటే ఒకరికి సంబంధించిన ప్రాంతంలోకి మరొకరు అడుగు పెట్టే పరిస్థితే లేదు. తాజాగా ఈ హింసా ప్రజ్వలన తర్వాత ఇంపాల్ తదితర జిల్లాల్లో తీవ్ర స్థాయిలో విద్యార్థుల నిరసనలకు కారణమైంది. భద్రత సలహాదారును, డిజిపి ని తొలగించాలని విద్యార్థులు కోరుతున్నారు. కుకీ తీవ్రవాదులతో ఆపరేషన్ నిలుపుదల ఒప్పందాన్ని (ఎఒఒ) రద్దు చేయాలనే ఉమ్మడి కమాండ్ కంట్రోల్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని వారు కోరుతున్నారు. పోలీసులతో ఘర్షణలు ఇంపాల్ తూర్పు పశ్చిమ జిల్లాలలో కర్ఫ్యూ విధించడానికి దారితీశాయి. ఇంటర్నెట్, మొబైల్ డేటా కూడా నిలిపివేయ బడ్డాయి. ఇరుపక్షాలతో సంప్రదింపులు, చర్చలు జరిపి రాజకీయ సమస్యను పరిష్కరిం చడంలో వైఫల్యంతో శాంతిభద్రతల పరిరక్షణకు, అలాగే చీలికల మధ్య శాంతిని కాపాడటానికి భద్రత బలగాలపై అతిగా ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల కేంద్ర పోలీస్ బలగాలు ప్రత్యేకించి అస్సాం రైఫిల్స్ ఒక అనివార్యమైన స్థానంలోకి వచ్చాయి. మెయితీ రాజకీయ పక్షాలు అస్సాం రైఫిల్స్‌ను, ఇతర కేంద్ర బలగాలను ఉపసంహరించాలని కోరుతున్నాయి. కుకి తీవ్రవాదులు డ్రోన్లను, రాకెట్లను ప్రయోగించటం వల్ల బయటి శక్తులు చొరబడుతున్నాయనే ఆందోళన మరింత పెరిగింది. ఇది జాతీయ భద్రతకు ముప్పు అవుతుంది.ముఖ్యమంత్రి పాక్షిక వైఖరికుకీ మిలిటెంట్ గ్రూపులతో ఆపరేషన్ల నిలుపుదల ఒప్పందం రద్దు చేయాలనే డిమాండ్ ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ నుంచి కూడా రావడం వల్ల కొండ ప్రాంతాల్లో మరోసారి తిరుగుబాటు కార్యక్రమాలు మొదలవవచ్చు.. తిరుగుబాటును అణచివేయటానికి సైన్యాన్ని మొహరించే పరిస్థితీ రావచ్చు. మెయితీ తెగ వారికి గిరిజన ఎస్టీ ప్రతిపత్తి కల్పించాలనే కోర్కెతో మొదలైన ఆందోళన, దానికి కుకీ-జో తెగల వారి నుంచి వచ్చిన ప్రతికూల స్పందన, ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ పాక్షిక పాత్ర వహించడం వల్ల మరింత తీవ్రతరమైంది. ఆయన కొన్ని మెయితీ తీవ్రవాద సంస్థల పట్ల సానుకూల సహాయ పాత్ర వహిస్తున్నారు. ఇటీవలనే బయిటకు వచ్చిన ఒక ఆడియో ఫైల్‌ను అల్లర్లపై దర్యాప్తు జరుపుతున్న విచారణ కమిషన్‌కు సమర్పించారు. ముఖ్యమంత్రి తన అధికార నివాసం నుంచి మాట్లాడుతున్నట్టు పోలీసు ఆయుధాగారం నుంచి వేలాది ఆయుధాలు కొల్లగొట్టిన వారి పట్ల ఆయన అనుకూలంగా ఉన్నట్లు ఆ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. బిరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా నిష్పాక్షిక వైఖరి అనుసరించకపోవటమే సమస్యకు మూల కారణం.కేంద్రం, బీజేపీ బాధ్యతా రాహిత్యంమోడీ ప్రభుత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం.. ముఖ్యమంత్రి పాక్షిక పాత్ర పూర్తిగా తెలిసి కూడా అతన్నే పదవిలో కొనసాగిస్తున్నారు. రాజకీయ స్థాయిలో చూస్తే బీజేపీ-ఆరెస్సెస్‌లు మెయితీ తీవ్రవాద జాతిదురభి మానానికి మరింత ఆజ్యం పోయడానికే పాల్పడుతున్నాయి. ఈ తీవ్రవాద సంస్థ వ్యవస్థాపకుడైన టెంగోల్ ఎల్ సనజోబాను రాజ్యసభ సభ్యుడిని చేయటమే ఇందుకు నిదర్శనం. ఈ సుదీర్ఘమైన ప్రతిష్టం భన అన్ని తరగతుల వారిలోనూ తీవ్రవాదాన్ని మరింత బలోపేతం చేయడానికి కారణమైంది. ప్రధాని నరేంద్ర మోడీ గత పదహారు నెలల్లో ఒక్కసారి కూడా మణిపూర్ సందర్శించలేదంటే మణిపూర్ పట్ల కేంద్ర బాధ్యతను విస్మరించటం ద్వారా మరింత పచ్చిగా కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగాలి. ప్రధాన జాతుల గ్రూపు లతో రాజకీయ సంప్రదింపుల ప్రక్రియ ప్రారం భించటం జరగాలి. శాంతియుత సాధారణ పరిస్థి తులను సృష్టించే వాతావరణం కావాలి. అన్ని జాతుల, పౌరుల హక్కులు రక్షించబడాలి. మణిపూర్‌లో ఈ రోగగ్రస్త భాగాన్ని శస్త్ర చికిత్సతో దేహం నుంచి తొలగించకపోతే అది మొత్తం ఈశాన్య భారతంలోనే చాలా తీవ్రమైన పర్యవసానాలకు దారితీస్తుంది.(సెప్టెంబర్ 11 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)