కేంద్రం సాయమేది!?

Editorialభారీవర్షాలు తెలుగు రాష్ట్రాలను వణికించాయి. మరోసారి తెలంగాణ ఆగమాగమైంది. వ్యవస్థలన్ని స్తంభించాయి. బాధితుల ఆక్రం దనలు మిన్నంటాయి. గతం నుంచి సర్కారు గుణపాఠాలు నేర్వక, మళ్లీ బాధితులు సామాన్య ప్రజలే అయ్యారు. ఇప్పుడూ నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్‌లోనూ ఇలాంటి విపత్తులే రాష్ట్రాన్ని కబలిస్తాయి. 22 జిల్లాల్లోని 173 మండలాలు వరద బురదలో తేలియాడుతుండటం చేదునిజం. కాంగ్రెస్‌ సర్కారు తక్షణ సాయం కింద రూ.5500 కోట్లు ఇవ్వాలని మోడీ సర్కారును కోరింది. విషయం తెలిసి ఆగమేఘాల మీద తెలుగు ముఖ్య మంత్రులతో మాట్లాడిన మన ప్రధాని, మాటలకే పరిమితమయ్యారు. సాయం కోసం ఇరు రాష్ట్రాలు చేతులు చాచి ఆరు రోజులవుతున్నా, దమ్మిడి విదల్చలేదు.
నిరంతరం నీతివాక్యాలు చెప్పే నాగ్‌పూర్‌ వారసులకు వరద బాధితుల ఆర్తనాదాలు వినిపించడం లేదేమో! దక్షిణ, ఉత్తర, ఈశాన్య భారతంలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, తమిళనాడు అసోం, మిజోరం, త్రిపుర, గుజరాత్‌,మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌, నాగాలాండ్‌ ఇటీవల వర్షాలు, వరదలకు అతలాకుతలమయ్యాయి. ఒక్క గుజరాత్‌కు మాత్రమే యుద్ధప్రాతిపదికన ఇంటర్‌ మినిస్టీరియల్‌ కేంద్ర బృందాన్ని (ఐఎంసీటీ) పంపిన మోడీ, మిగతా రాష్ట్రాలను అలక్ష్యం చేస్తున్నారు. కొండ చరియలు విరిగిపడి భారీ విపత్తునకు లోనైన కేరళకు వెళ్లిన ప్రధాని మోడీ, తక్షణ సాయం కింద రూ.వెయ్యి కోట్లు ఇవ్వాలన్న సీఎం పినరరు విజయన్‌ విజ్ఞప్తిని పెడ చెవినపెట్టారు. కోవిడ్‌తో పాటు కనివిని ఎరగని రీతిలో వరదలను పక్కాగా ఎదుర్కొన్న సీపీఐ(ఎం) పాలిత రాష్ట్రం కేరళం. గల్ఫ్‌ నుంచి కేరళకు వచ్చిన రూ.700 కోట్లను మానవత్వాన్ని మరిచి కేవలం రాజకీయాల కోసమే అడ్డుకున్న ఘనత బీజేపీదే.
సమాఖ్య వ్యవస్థను తుంగలో తొక్కిన కేంద్ర సర్కారు విధానాలను అడ్డుకోవాల్సినవే. రాష్ట్రాల నుంచి వరద నష్టాల నివేదికలు అందిన తర్వాతే ఐఎంసీటీ బృందాలు గతంలో బాధిత ప్రాంతాలకు వెళ్లేవి. కొత్త చట్టం మేరకు విపత్తు జరిగిన వెంటనే రాష్ట్రాల్లో పర్యటించి, అక్కడికక్కడ పరిస్థితులు, నష్టాలను అంచనా వేసి కేంద్రానికి నివేదిక లివ్వాలి. ఇప్పుడా హడావిడి కేవలం గుజరాత్‌లో తప్ప మరే రాష్ట్రంలోనూ కనిపించదు. తెలంగాణ సీఎం రేవంత్‌ లేఖ రాసినా, ఒక్క ఐఎంసీటీ బృందం రాష్ట్రం గడపతొక్కక పోవడం ‘మోషా’ల చిత్తశుద్దిని ప్రశ్నార్థకం చేస్తున్నది. అలాగే గుజరాత్‌లో ప్రధాని మోడీ స్వయంగా అక్కడి ముఖ్య మంత్రిలా వరద పరిస్థితులను సమీక్షిస్తూ పర్యవేక్షిస్తున్నారు. మరి రాజ్యాంగం మాటేంటి? అది చెప్పే సమానత్వం సంగతేంటి? అవసరమైతే రాష్ట్రాలకు హెలికాప్టర్లను పంపిస్తామన్న మోడీ మాటలు గాలి కబుర్లే అయ్యాయి. మాటలు కోటలు దాటుతున్నా, చేతలు గడప దాటడం లేదు. ప్రధానికి తరచూ కోరస్‌ చేప్పే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, అదనపు నిధులను సాధించకుండా ప్రస్తు తం ఉన్న నిధు లను వాడుకోవాలని ఉచిత సలహా పడేయడం విడ్డూరం. ఇదిలావుంటే, వరద పరిస్థితి వివరాలతో పాటు వివిధ రికార్డులు, డాక్యుమెంట్లు పంపాలంటూ కేంద్రం, చాంతాడంతా లేఖను రాష్ట్రానికి పంపడం గమనార్హం.
కన్నీటి సంద్రమైన రాష్ట్రం ముఖచిత్రాన్ని, బాధితుల హాహాకారాలను వినేందుకు, చూసేందుకు మోడీకి మన సొప్పడం లేదు కాబోలు.జాతీయ విపత్తు నిర్వహణా చట్టం,2005తో ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ ఏర్పాటయ్యాయి. ఆ చట్టంలోని సెక్షన్‌ 48(1)(ఏ) ప్రకారం ఈ సంస్థలకు విపత్తుల సమర్థ నిర్వహణకుగాను కనీస నిధులను ఇవ్వ కుండా కేంద్రం నిర్వీర్యం చేస్తున్నది.14వ, 15వ ఆర్థిక సంఘాలూ ప్రకృతి విపత్తుల్లో రాష్ట్రాలకు అండగా నిలబడి ఆర్థికసాయం చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అని నొక్కిచెప్పాయి.80:20 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేశాయి. మరి ఇది అమలవుతోందా? తాను రూపొందించిన చట్టాన్ని తానే ఉల్లంఘిస్తున్నది.అది బీజేపీకే సిగ్గుచేటు.
కోవిడ్‌లో తెలంగాణ అల్లాడుతూ రూ.11,092 కోట్లు సాయం అర్ధిస్తే, కేంద్రం రెండు దఫాలుగా రూ. 673.5 కోట్లిచ్చి చేతులు దులుపుకుంది. 2020లోనూ వరదలకులోనై రూ.9,400 కోట్లు అడిగితే, అప్పుడూ నిరాశే మిగిల్చింది. అదే బీజేపీ పాలిత రాష్ట్రాలకు వేలకోట్లు కుమ్మరించిన మాట వాస్తవం కాదా? ఇది బీజేపీ కుత్సిత రాజకీయాలకు మచ్చుతునక. విపత్తు సమయాల్లో కేంద్ర, రాష్ట్రాలు సమన్వయం చేసుకోవాలి. రాజకీయపార్టీలూ సంయమనం పాటించాలి. అంతా ఉమ్మడిగా ఒక పట్టుపట్టి వరద బాధితులను గట్టెక్కించాలి. ఎన్నికలప్పుడే రాజకీయాలు అంటూ నీతులు చేప్పే బీఆర్‌ఎస్‌, ఇప్పుడు బురద రాజకీయాలకు తెగబడటం సముచితం కాదు. ప్రజలు, బాధితులు గమనిస్తున్నారు. బాధల్లో ఉన్నవారిని అక్కునచేర్చుకోవాలి. బాధ్యతగా భరోసానివ్వాలి.బాధితుల నిస్సహాయతను అవకాశంగా తీసుకుంటే, అద:పాతాళానికి తొక్కేరోజులు స్థానిక సంస్థల ఎన్నికల రూపేణా ముందరే ఉన్నాయనే సంగతిని ఇరుపార్టీలూ మరవకూడదు.