– మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రం అనుసరిస్తున్న రైస్ పాలసీపై పునరాలోచించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన 2024 గ్లోబల్ రైస్ సమ్మిట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎగుమతులపై నిషేధం కారణంగా దేశ రైతాంగం ఇబ్బంది పడుతున్నదని తెలిపారు. రేషన్ ద్వారా ఇస్తున్న బియ్యాన్ని ఎవరూ వాడుకునే పరిస్థితి లేదనేది అందరికి తెలిసిందేననీ, అలాంటప్పుడు అదే బియ్యాన్ని మార్కెట్‌లో రూ.29కి ఇవ్వాలన్న కేంద్రం నిర్ణయంతో ఉపయోగముండదని చెప్పారు. వాటికి బదులు అదే ధరకు ప్రజలు డిమాండ్ చేస్తున్న రైస్ పాలసీపై కేంద్రం పునరాలోచించాలి బియ్యాన్ని ఇస్తే బాగుంటుందని సూచించారు. నిషేధం ఎత్తేసే అన్ని రకాల పంటలను పండించే రైతులకు మేలు కలుగుతుందన్నారు. హైదరాబాద్ లో జూన్ 4 నుంచి 6 వరకు జరిగే సమ్మిట్‌లో ప్రపంచవ్యాప్తంగా 400 మంది నుంచి 600 మంది వరకు శాస్త్రవేత్తలు, మార్కెట్ నిపుణులు తదితరులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. ఈ సమ్మిట్ రైతాంగానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మార్కెట్ అవకాశాలపై అవగాహన పెంచుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు తదితరులు పాల్గొన్నారు.