సహకార చట్టాల సవరణను కేంద్రం ఉపసంహరించుకోవాలి

– తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రాష్ట్ర సహకార సంఘాల సవరణ చట్టాన్ని రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ డిమాండ్ చేశారు.సుప్రీం కోర్టు తీర్పులను అతిక్రమిస్తూ సహకార బ్యాంకులు, సహకార సంస్థలలోని వాటాలు సభ్యులు కానీ పెట్టుబడిదారులకు అమ్మాలని ఈ చట్టాలలోని సెక్షన్లు నిర్దేసిస్తున్నాయని సమావేశం ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చైతన్య సేద్యం 2025 రైతుల డైరీని ఆవిష్కరించారు. అనంతరం శోభన్ మాట్లాడుతూ డిమాండ్ చేసింది. సహకార చట్టంలో పొందుపరిచిన సహకార సూత్రాలకు భిన్నంగా ఈ చట్టాలలోని సెక్షన్లు ఉన్నాయన్నారు. ఈ చట్టం అమలైతే సహకార వ్యవస్థ ఉనికికే ప్రమాదమని, ఈ రంగం స్వయంప్రతిపత్తి కోల్పోతుందని పేర్కొన్నారు. సహకార చట్టాల ప్రకారం వాటాలు బహిరంగ మార్కెట్లో అమ్మడం, బదలాయించడం నిషేధమని ఆయన చెప్పారు.
సన్న, చిన్నకారు రైతులు, చేతివృత్తిదారులు, బలహీనులకు సాధికారత కల్పిస్తున్న సహకార విధానాన్ని రక్షించేందుకు సవరించిన చట్టాలలోని సెక్షన్లను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్ర శాసన సభలో తీర్మానం చేయాలని కోరారు. సహకార చట్టం రాష్ట్ర పరిధిలోని అంశం అని, కేంద్ర ప్రభుత్వానికి జోక్యం చేసుకునే హక్కు లేదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాలను సంప్రదించకుండా వారి ఆమోదం లేకుండా కేంద్రం ఏకపక్షంగా చట్టాలను తీసుకువస్తున్నదని ఆయన విమర్శించారు. పార్లమెంటు స్టాండింగ్ కమిటీలో ప్రతిపక్ష సూచనలను కూడా ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. సహకార వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలోనే ఉన్నందున ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, ఈ రంగాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఏం గంగాధరప్ప పల్లపు వెంకటేష్ జిల్లా ఉపాధ్యక్షులు టి భూమన్న, దేవేందర్ సింగ్, దేవుని రాజన్న, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.