అదానిఎయిర్‌పోర్టులపై కేంద్రం దర్యాప్తు కంటితుడుపు చర్య

 Central investigation on Adani Airports Blinking action– కాంగ్రెస్‌
న్యూఢిల్లీ : అదాని గ్రూపునకు చెందిన రెండు ఎయిర్‌పోర్టుల ఆర్థిక లావాదేవీలపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (ఎంఐఎఎల్‌), నవీ ముంబయి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు లిమిటెడ్‌ (ఎన్‌ఎంఐఎఎల్‌) యొక్క ఆర్థిక లావాదేవీలను, ఇతర ముఖ్యమైన పత్రాలను అందచేయాలని కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ అదాని గ్రూపు సంస్థలను ఆదేశించింది. ఈ విషయాన్ని ఆ గ్రూపునకు చెందిన అదాని ఎంటర్‌ ప్రైజెస్‌ స్వయంగా ధృవీకిరించింది. ఈ మేరకు దేశంలోని పలు స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఆ సంస్థ రాసిన లేఖ శనివారం వెలుగులోకి వచ్చింది. 2017-18 నుండి 2021-22 ఆర్థిర సంవత్సరాల వరకు ఉన్న పూర్తిస్థాయి సమాచారాన్ని అందచేయాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు ఈ లేఖలో అదాని సంస్థ తెలియచేసింది. కార్పొరేట్‌ మంత్రిత్వశాఖ. హైదరాబాద్‌ విభాగం నుండి తమకు ఆదేశాలు అందినట్లు తెలిపింది. దేశ వ్యాప్తంగా కలకలం రేపిన హిండెన్‌బర్గ్‌ నివేదికలో అదాని గ్రూపు అక్రమాలను వివరంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. అనంతర పరిణామాల్లో భాగంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ చర్యను చేపట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, కాంగ్రెస్‌ పార్టీ దీనిని కంటి తుడుపు చర్యగా కొట్టిపారేసింది. ఈ మేరకు ఆ పార్టీ నేత జైరామ్‌ రమేష్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌)లో పోస్టు చేశారు. తన కార్పొరేట్‌ ముఖాన్ని కాపాడుకునేందుకే మంత్రిత్వశాఖను రంగంలోకి దించిందని, పి.ఆర్‌ మాయాజాలాన్ని మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వానికి చిత్తశుద్ది అదాని అక్రమాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.
ఏం జరిగింది…?
ట్యాక్స్‌ హెవెన్‌ల ద్వారా భారీ మొత్తంలో పన్నులను ఎగవేశారని, అక్రమ పద్దతులలో షేర్‌ విలువను భారీగా పెంచుకున్నారని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. యుపిఎ ప్రభుత్వ హయంలోనే అదాని అక్రమాలపై సెబి దర్యాప్తు ప్రారంభించిందని, కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ దర్యాప్తు ప్రక్రియ ఆగిపోయిందని కూడా హిండెన్‌బర్గ్‌ పేర్కొనడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఆరోపణలపై విచారణకు మే నెలలో సుప్రీంకోర్టు ఒక ప్యానెల్‌ను కూడా నియమించింది. ఈ నేపథ్యంలో గత వారంలో ప్రచురించిన ఒక కథనంలో అదాని గ్రూపుపై తమ దర్యాప్తును మధ్యలోనే ఎందుకు ఆపివేయాల్సివచ్చిందో వివరిస్తూ ఒక సమగ్ర నివేదికను సెబి అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనుందని రారుటర్స్‌ పేర్కొంది. ఫైనాన్షియల్‌ టైమ్స్‌ గురువారం ప్రచురిం చిన ఒక కథనంలో బొగ్గు దిగుమతుల్లో అదాని గ్రూపు చేసిన అక్రమాలను, భారతీయ విద్యుత్‌ ఉత్పత్తి సంస్థలకు అత్యధిక ధరలకు అంటకట్టిన తీరును వివరించింది. ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్టు (ఒసిసిఆర్‌పి) ఒక నివేదికలో అదాని కుటుంబ భాగస్వాములు ఆఫ్‌షోర్‌ ఫండ్లను వినియోగించి స్టాక్‌ మార్కెట్‌లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారని పేర్కొన్నట్లు సమాచారం. వరసగా చోటుచేసు కుంటున్న ఈ పరిణామలు, త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తాజా విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించి ఉంటుందన్న అభిప్రాయం పరిశీలకుల్లో వ్యక్తమవుతోంది.