కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్ర బడ్జెట్ ను సవరించాలి..

– తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి..
– ఎంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న..
నవతెలంగాణ సూర్యాపేట కలెక్టరేట్
    ప్రజా ప్రయోజనాలకు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ను సవరించి రాష్ట్రానికి న్యాయం చేయాలని ఎంసిపిఐ(యు) కేంద్ర కమిటీ సభ్యులు వరికుప్పల వెంకన్న జిల్లా కార్యదర్శి షేక్ నజీర్,డిమాండ్ చేశారు. ఎం సి పి ఐ యు.ఆర్ ఎం పి ఐ కేంద్ర కమిటీ పిలుపు మేరకు శనివారం భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను జిల్లా కేంద్రంలోని పొట్టి శ్రీరాములు సెంటర్ వద్ద దాహానం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దోపిడిదారులకు అనుకూలంగా కష్టజీవులకు వ్యతిరేకంగా ఉందని ఈ క్రమంలో పేద మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడే పథకాలకు నిధులను తగ్గించి ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించారని మరోవైపు ఉన్నత వర్గాలకు పెట్టుబడిదారులకు సబ్సిడీలు రాయితీలు కల్పించారని అన్నారు. బడ్జెట్ రాబట్టడానికి ప్రజలపై భారాలు వేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఆహార భద్రతకు నిధులు తగ్గించి తూట్లు పొడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల పంటల మద్దతు ధర కల్పించేందుకు, పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి తోడ్పడకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర బడ్జెట్ను సవరించి దేశ ప్రజల ప్రయోజనాలను రాష్ట్రాల అవసరాలను గుర్తించి తగిన విధంగా బడ్జెట్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక నిధులు ఇచ్చి కేంద్ర ప్రభుత్వ వివక్షతను మానుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి ఏపూరి సోమన్న జిల్లా కమిటీ సభ్యులు వేముల పెద్ద నరసయ్య నలుగురి రమేష్ లింగంపల్లి ఓంకార్ నక్క శ్రీనివాస్ గుంటక నాగరాజు షేక్ ఆసిఫ్ నేతి వేణు సోమ గాని వెంకన్న తదితరులు పాల్గొన్నారు.