– పవిత్రమైన పదవిలో ఉండి మద్యం సేవించడం సిగ్గుచేటు
– చైర్మన్ మద్యం సేవించే స్థలంలో గొడవ
– పోలీస్‌స్టేషన్లో ఒకరిపై ఒకరు ఫిర్యాదు
– భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో చైౖర్మన్ విఫలం
నవతెలంగాణ-కొమురవెల్లి
కొమురవెల్లి మల్లన్న ఆలయ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి ఆలయ పరిసర ప్రాంతాల్లో మద్యం సేవించడం ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ఉందని సీపీఎం మండల కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి విమర్శించారు. శనివారం పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్తిరెడ్డి మాట్లాడుతూ మల్లన్న సన్నిధిలో సేవ చేసే పవిత్రమైన పదవిలో ఉన్న చైర్మన్ ఆలయ పరిసర ప్రాంతంలో మద్యం సేవించి ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. కనీస సౌకర్యాలు లేక గత రెండు వారాలుగా జాతరకు వచ్చిన భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, సౌకర్యాలు మెరుగుపరిచే చర్యలపై శ్రద్ధ చూపెట్టకుండా శుక్రవారం రాత్రి తన అనుచరులతో మద్యం సేవించిన ప్రాంతంలో గొడవ జరిగిందని, పోలీస్‌స్టేషన్లో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారని గుర్తు చేశారు. ఆలయ చరిత్రలో ఏనాడు ఇలాంటి సంఘటనలు జరగలేదని చెప్పారు. పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పదవిలో ఉండి ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడి ఆలయ పవిత్రతకు భంగం కలిగేలా ప్రవర్తించిన చైర్మన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో స్థానిక ప్రజలను, మల్లన్న భక్తులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బద్దిపడగ కిష్టారెడ్డి, మండల నాయకులు తాడూరి మల్లేశం, బక్కేల్లి బాలకిషన్, పుల్లంపల్లి సాయిలు, నీల బిక్షపతి, ఆరుట్ల రవి, చింతల శ్రీనివాస్, నాగమల్లి తదితరులు పాల్గొన్నారు.