అస్సాంలో పరిస్థితి ఎప్పటికప్పుడు దిగజారిపోతున్నది. కొన్ని వర్గాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలూ, ప్రజలను మత ప్రాతిపదికన దురభిమాన తరహాలో విభజించేందుకు కొన్ని ధోరణులూ ఇందుకు కారణమవుతున్నాయి. ప్రస్తుత ఈ పరిస్థి తులకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, బీజేపీ నాయకత్వం లోని ప్రభుత్వం మాత్రమే పూర్తి బాధ్యత వహించవలసి వుం టుంది. ముస్లింలపై విద్వేషం పెంచే తన తన ప్రచారకాండ లో హిమంత బిశ్వశర్మ అన్ని హద్దులూ దాటేశారు. దేశీయకు వ్యతిరేకంగా బయటివారు అనే తన విభజన రాగం లోనూ ఆయన హద్దు మీరారు. మతపరమైన మైనార్టీలను బయటి వారు అంటూ ముద్ర వేస్తూ వారిపైన ఏదో ఒక విశఅంఖల ఆరోపణ చేయకుండా ఒక్క రోజు కూడా గడవడం లేదు. ఆయన పనిగట్టుకుని చేస్తున్న విభజన రాజకీయ ప్రసం గాల చిచ్చు ప్రజల్లో కొన్ని తరగతుల ప్రజలను రెచ్చగొడుతున్నది. మైనారిటీలకు వ్యతిరేకంగా హింసాత్మక వాతావర ణానికి దారి తీస్తున్నది. లైంగిక పరమైన దాడులకు సంబంధించిన రెండు కేసులలో వ్యవహరించిన తీరు ఇందుకు నిదర్శనం గా వుంది.
శివసాగర్ పట్టణంలో మార్వారీ వర్గానికి చెందిన ఇద్దరు వ్యక్తులు పదిహేడేళ్ల అమ్మాయిపై చేసిన దాడి ప్రజ్వలనకు దారితీసింది. బయటివారిపై కొన్ని సంస్థలు బెదిరింపులకు పాల్పడ్డాయి. నేరస్తులపై చర్య తీసుకోవాలని కోరడానికి బదులు మొత్తం మార్వారీ వర్గాన్ని ఈ నేరానికి బాధ్యులైనట్టు నిందాప్రచారం సాగింది. ఎగువ అస్సాంలో అస్సామీ యేతర వ్యాపార వర్గం మొత్తానికి వ్యతిరేకంగా పెద్ద నిసనగా మారింది. చివరకు శివనగర్‌లో ఆ వర్గం ప్రతినిధులు రాష్ట్ర కేబినెట్ మంత్రి, పోలీసు సూపరిండెంటు సమక్షంలో మోకాళ్లపై వంగి క్షమాపణలు చెప్పాలని ఒత్తిడి చేసి చెప్పించే పరిస్థితికిది దారి తీసింది. నాగాన్ జిల్లాలో ముగ్గురు ముస్లిం యువకులు పద్నాలుగేళ్ల మైనర్ బాలికపై సామూహిక లైంగికదాడికి పాల్పడిన ఘటన ఇంతకన్నా తీవ్రమైన పరిస్థితికి దారితీసింది. దీనిపై నిరసనను తూర్పు బెంగాల్ కు చెందిన ముస్లింలు అందరిపైకి మళ్లించి వారిని మియాలు అంటూ అవమానించారు. ఆరెస్సెస్, బీజేపీలకు చెందిన కొన్ని సంస్థలు మియాలకు బెదిరింపులు జారీ చేస్తూ అస్సాం వదిలి పొమ్మని భయపెడుతున్నాయి. మియా వర్గానికి చెందిన నిర్మాణ కార్మికులను విచక్షణా రహితంగా కొట్టిన ఘటన తర్వాత బెంగాలీ మాట్లాడే ముస్లింలు వేలాదిమంది ఎగువ అస్సాం నుంచి పారిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఒకవైపునే ముఖ్యమంత్రి
ఈ విషయంలో తాను ఒక వైపునే వుంటాననీ, మియాలు అస్సాంను స్వాధీనం చేసుకోవడాన్ని అనుమతించబోననీ ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ శాసనసభలో ప్రకటించారు. అన్ని రంగాల్లో విఫలమైన తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఆయన పూర్తి స్థాయిలో ముస్లిం వ్యతిరేక ప్రచారానికి దిగారు. మహిళల రక్షణలో ఘోరంగా విఫలమవడంతో ఘోరమైన లైంగికదాడులు, హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయి. ఆరు వెనకబడిన తరతులకు ఎస్టీ ప్రతిపత్తి కల్పించాలనే కోర్కె అపరిష్కృతంగానే వుండిపోయింది. భూమిని కాపాడాలనీ, 1971 నుంచి దశాబ్దాలుగా అస్సాంలో వుంటున్న భూమి లేని ప్రజలకు భూ పంపిణీ చేయాలనే డిమాండు కూడా పూర్తిగా ఉపేక్షించబడింది. వరదలు, భూమి కోత సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం చిటికెన వేలు కదిల్చింది లేదు. నిరుద్యోగం ఎప్పటికప్పుడు పెరుగుతూ పోతున్నది. శర్మ, ఆయన సర్కారు పచ్చి మతతత్వ ప్రచారం ప్రారంభించడానికి ఇదే నేపథ్యం. సరిగ్గా ఇదే. మహిళలపై లైంగికదాడులతో సహా ఈ నేరాల విజృంభణకు అన్ని మతాల వారున్నప్పటికీ ముస్లింలపై మాత్రమే నేరస్తులుగా ముద్ర వేసి నిందించడం జరుగుతున్నది. రాజధాని గౌహతిలో కఅత్రిమమైన వరదల సమస్యను కప్పిపుచ్చడం కోసం వరద జిహాద్ నినాదాన్ని కనిపెట్టింది కూడా హిమంత శర్మనే.
18 ప్రతిపక్షాల విజ్ఞప్తి
ముఖ్యమంత్రి పదవి నిర్వహించడానికి సంబంధించిన రాజ్యాంగ ప్రమాణాలన్నిటినీ హిమంత శర్మ ఉల్లంఘించారు. ”ఎలాంటి భయం, పక్షపాతం, ప్రేమ, వ్యతిరేకత లేకుండా రాజ్యాంగం, చట్ట నిబంధనల మేరకు ప్రజలకు అన్ని విధాల న్యాయం చేస్తాన”ని ముఖ్యమంత్రిగా ఆయన చేసిన ప్రమాణాన్ని బాహాటంగా ఉల్లంఘించారు. శాసనసభ లోపలా వెలుపలా ముఖ్యమంత్రి ఉవాచలు ఈ అధికార ప్రమాణాన్ని వమ్ము చేసేలా వున్నాయి. రాజకీయ రాజ్యాంగ నైతికతను ఆయన అవమానకరమైన రీతిలో తొక్కిపారేశారు.అందువల్లనే ముఖ్యమంత్రి హిమం త బిశ్వశర్మను పదవి నుంచి తొలగించవలసిందిగా కోరుతూ 18 ప్రతిపక్ష పార్టీలు ఆగష్టు 29న అస్సాం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి ఒక మెమోరాండం సమర్పించాయి. మత విద్వేషాన్ని వ్యాపింప చేస్తున్నందుకు, రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నందుకు ఆయనను డిస్మిస్ చేయాలని ఆమెను కోరాయి. పదవీ ప్రమాణాన్ని రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక ముఖ్యమంత్రిపై చర్య తీసుకోదగిన సందర్భమంటూ ఏదైనా వుందంటే ఇంతకన్నా మరొకటి వుండబోదు.
(సెప్టెంబరు 4 ‘పీపుల్స్ డెమోక్రసీ’ సంపాదకీయం)