బిడ్డ ఆశకు జీవం పోసింది

బిడ్డ ఆశకు జీవం పోసిందిప్రభుత్వ ఉద్యోగం వస్తే కాలు మీద కాలేసుకొని బతకొచ్చనేది చాలా మంది భావన. అందుకే యువత సర్కారీ కొలువు కోసం విపరీతంగా శ్రమిస్తుంటారు. ఉద్యోగం పొందినవారిలో కొందరు సక్రమంగా చేసుకుంటే.. మరికొందరు అడ్డదారుల్లో లంచాలకు అలవాటు పడి అక్రమంగా సంపాదిస్తుంటారు. అలా లెక్కకు మించి అక్రమార్జనతో దొరికిపోయిన ప్రభుత్వ ఆఫీసర్లు ఎంతో మంది ఉన్నారు. ఆదాయానికి వందల రెట్లు అధికంగా ఆస్తులు సంపాదించిన తీరు చూసి మనం విస్తుపోయాం. కానీ అదే ప్రభుత్వ ఉద్యోగం కోసం తన సొంత ఆస్తులను త్యాగం చేసిన వారి గురించి ఇప్పటి వరకు ఎవ్వరూ విని వుండరు. కానీ తమిళనాడులో ఓ మహిళా ప్రభుత్వ అధికారిణి తన కోట్లాది రూపాయల విలువ చేసే స్థలాన్ని ఓ మంచి పని కోసం ప్రభుత్వానికి ఇచ్చేసి ఆదర్శంగా నిలిచారు. ఇంతకీ ఆమె దేనికోసం ఆ స్థలాన్ని ఇచ్చిందో చూద్దాం..
ఆమె పేరు ఆయి అమ్మాళ్‌ అలియాస్‌ పూర్ణమ్‌. ఉండేది తమిళనాడులోని మధురై జిల్లాలో. ఒకరోజు ఉన్నట్టుండి జిల్లా విద్యాశాఖాధికారి ఆఫీసుకెళ్లారు. సంచిలో నుంచి నాలుగు కాగితాలు తీసి టేబుల్‌పై పెట్టారు. ఆ డాక్యుమెంట్స్‌ చూసిన వెంటనే ఆయన కళ్లల్లో నీటిచారలు. తన ఎకరంన్నర స్థలం.. సుమారు రూ.7 కోట్ల విలువ చేస్తుంది. ఆ స్థలాన్నే గవర్నమెంట్‌ స్కూల్‌కి ఇచ్చేశారు అమ్మాళ్‌. పంచాయతీ స్కూల్‌ను హైస్కూల్‌గా మార్చమని కోరారు. సక్రమంగానో.. అక్రమంగానో ఆస్తులు కూడ బెట్టుకోవడం తప్ప మరో ఉద్దేశం లేని మనిషులకు లేని రోజుల్లో రూ.7 కోట్ల భూమిని ఊరి పిల్లల చదువు కోసం ఇచ్చేశారు.
కూతురిపై ప్రేమతో…
కూతురు డిగ్రీ చదువుకుంటూ పేదల కోసం పోరాడుతుండేవారు. మురికివాడల్లో పిల్లలకు చదువు చెప్పేది. చదువు మాత్రమే బడుగుల జీవితాలను మారుస్తుందని ఆ బిడ్డ తల్లికి ఎప్పుడూ చెబుతుండేది. అలాంటి బిడ్డ చిన్న వయసులోనే కాలం చేసింది. కూతురు చనిపోయినా ఆమె ఆశయానికి జీవం పోసింది అమ్మాళ్‌. ఎప్పుడో పుట్టింటోళ్లు పెండ్లి కానుకగా ఇచ్చిన స్థలాన్ని పాఠశాల భవనం కోసం ప్రభుత్వానికి ఇచ్చేసింది. కెనరా బ్యాంక్‌లో క్లర్క్‌గా పని చేస్తున్న ఆమెకు నోట్ల కట్టలు చూడటం కొత్త కాదు. అయినా రూ.7 కోట్ల విలువైన భూమిపై ఆమెకు ఎలాంటి ఆశాలేదు. పేద పిల్లల చదువుల్లో తన బిడ్డను చూసుకోవాలనుకుంది ఆ తల్లి. ఇంతటి గొప్ప పని చేసినందకు రిపబ్లిక్‌ డే సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్‌.. ఆమె నిలువెత్తు సేవకు సెల్యూట్‌ చేశారు. ఆమెది ఎంత పెద్ద మనసో ఆ మోపుపై చెరగని చిరునవ్వు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ఆమె గొప్ప మనసు గురించి సోషల్‌ మీడియా వేదికగా ఎంతో మంది కామెంట్లు పెడుతున్నారు.