ఆ ప్రభుత్వాల చొరవతోనే వర్గీకరణ తీర్పు

– కాంగ్రెస్‌ నేత గజ్జల కాంతం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
పంజాబ్‌, తెలంగాణ ప్రభుత్వాల న్యాయపోరాటం, పట్టుదల, చొరవతోనే ఎస్సీ వర్గీకరణ తీర్పు వచ్చిందని కాంగ్రెస్‌ నేత గజ్జల కాంతం చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు గత 30 ఏండ్లుగా పోరాడుతున్నారని గుర్తు చేశారు. ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో కూడా ఈ అంశంపై హైకోర్టు, సుప్రీం కోర్టును ఆశ్రయించిన వారికి న్యాయం జరగలేదని తెలిపారు. పంజాబ్‌ ప్రభుత్వం కూడా వర్గీకరణ కావాలంటూ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడి కోర్టు కొట్టివే సిందని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, పంజాబ్‌ ప్రభుత్వం చొరవ తీసుకుని న్యాయ పోరాటం చేయడం ద్వారానే తీర్పు వచ్చిందన్నారు.  ఎస్సీ వర్గీకరణకు కారణం బీజేపీయే అంటూ కొంత మంది ప్రచారం చేస్తు‌న్నా‌ర‌ని ఎద్దేవా చేశారు. అదే నిజమైతే ఆ పార్టీ పార్లమెం టులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టలేదని ప్రశ్నిం చారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా ప్రాతిపదికన వర్గీకరణ జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.