ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తామని మాట ఇచ్చి తప్పడం వలన మాదిగ ఉపకులాలకు రావలసిన ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందక ఉద్యోగ విద్య రంగంలో తీవ్ర నష్టం జరుగుతుందని మాదిగ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు మంద దేవేంద్ర ప్రసాద్ మాదిగ అన్నారు.
కావున శాసనసభలో ఇచ్చిన మాటకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని బీసీ సంఘ భవనంలో మాదిగ ఉద్యోగుల జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగు గంగయ్య మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మాదిగ ఉపకులాల ఉద్యోగుల సదస్సులో రాష్ట్ర అధ్యక్షులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేబర్తి యాదగిరి మాట్లాడుతూ.. సుదీర్ఘంగా 30 సంవత్సరాలలో ఎన్నో పోరాటాలు త్యాగాలు ద్వారా సాధించుకున్న ఎస్సీ వర్గీకరణను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇకనైనా వర్గీకరణ అమలు చేసి మాదిగలకు న్యాయం చేయాలన్నారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేసి వర్గీకరణ అమలు చేసుకునేంతవరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సదస్సులో మాదిగ ఉద్యోగుల రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఉప్పరి పల్లి నాగభూషణం, జిల్లా ఉపాధ్యక్షులు కొల్లూరు శంకర్, తరుడి వసంత్, సాంబశివరావు, సీనియర్ నాయకులు, సందూరి వినయ్ సాగర్, గుర్రాల ఆశన్న, కొప్పర్తి రాజన్న, కూడాల నరసయ్య, అగ్గిమల్ల భూమన్న, ఆరెపల్లి గణేష్ , చందల వెంకటేష్, సొన్న సుధాకర్, దుమల శివ, రాజు, జిల్లా పెళ్లి రమేష్, శ్రీకర్, మనోజ్ పాల్గొన్నారు.