– 345 టార్గెట్‌ను ఊదేశారు
– ఛేదనలో రిజ్వాన్, అబ్దుల్లా శతకాలు
– శ్రీలంకపై పాక్ ఘన విజయం
నవతెలంగాణ-హైదరాబాద్ : శ్రీలంకతో ప్రపంచకప్ గ్రూప్ దశ మ్యాచ్. పాకిస్థాన్ లక్ష్యం 345 పరుగులు. ఓపెనర్ ఇమామ్‌ఉల్ హాక్ (12), కెప్టెన్ బాబర్ ఆజామ్ (10) ఆరంభంలోనే అవుటయ్యారు. 37/2తో పాకిస్థాన్ తీవ్ర ఒత్తిడిలో కూరుకుంది. ఈ సమయంలో శ్రీలంక విజయం నల్లేరు మీద నడకే అనిపించింది. కానీ ప్రపంచకప్ అరంగేట్ర బ్యాటర్ అబ్దుల్లా షఫీక్ (113, 103 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), మహ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్, 121 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) శతకాలతో చెలరేగారు. రెండో వికెట్‌కు 176 పరుగుల భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. కండరాలు పట్టేసి బాధతో విలవిల్లాడుతూనే మహ్మద్ రిజ్వాన్ కెరీర్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ధనాధన్ మెరుపులతో దండయాత్ర చేసిన అబ్దుల్లా, రిజ్వాన్‌లు పాకిస్థాన్‌కు ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయాన్ని కట్టబెట్టారు. సయీద్ షకీల్ (31), ఇఫ్తీకార్ అహ్మద్ (22 నాటౌట్) సైతం ఆకట్టుకున్నారు. 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి పాకిస్థాన్ 345 పరుగులు చేసింది. ఆరు వికెట్ల తేడాతో అద్బుత విజయం ఖాతాలో వేసుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక సైతం ధనాధన్ జోరు చూపించింది. కుశాల్ మెండిస్ (122, 77 బంతుల్లో 14 ఫోర్లు, 6 సిక్స్‌లు), సదీర సమరవిక్రమ (108, 89 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) పాకిస్థాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. మహ్మద్ రవూఫ్, షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌ను ఈ జోడీ చీల్చి చెండాడింది. ఈ ఇద్దరు మెరుపు సెంచరీలతో శ్రీలంక 50 ఓవర్లలో 9 వికెట్లకు 344 పరుగులు చేసింది. ఓపెనర్ నిశాంక (51, 61 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఐసీసీ ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా పాకిస్థాన్ రికార్డు నెలకొల్పగా.. ఓ ప్రపంచకప్ మ్యాచ్‌లో నాలుగు శతకాలు నమోదు కావటం సైతం ఇదే ప్రథమం. మహ్మద్ రిజ్వాన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. పాకిస్థాన్, శ్రీలంక మ్యాచ్‌తో హైదరాబాద్ వేదికగా ఐసీసీ 2023 ప్రపంచకప్ మ్యాచులు ముగిశాయి.