తెలంగాణ రాష్ట్రంలో జనవరి నెలను రోడ్డు భద్రతా మాసోత్సవంగా ప్రకటించింది ప్రభుత్వం. ఈ సందర్భంగా జరిగిన చర్చా వేదికలో పోలీసు అధికారులు, విద్యావేత్తలు, రోడ్డు ట్రాన్స్‌పోర్టు అధికారులతో పాటు, నేను కూడా పాల్గొన్నాను. రాష్ట్రంలో 2014లో 71,52,803 వాహనాలు రోడ్లపై తిరుగుతుండగా, 2024 నాటికి వీటి సంఖ్య 1,71,41,898 వాహనాలు తిరుగుతున్నట్లుగా గణాంకాలు తెలిజేస్తున్నాయి. హైదరాబాదు నగరంలో 88 లక్షలకు పైగా వాహనాలు తిరుగుతుండగా, ప్రతియేటా 18 వేలకు పైగా కొత్త వాహనాలు వస్తున్నట్లుగా పోలీసు అధికారులు తెలియజేసారు. రాష్ట్రంలో 27,737 కిలో మీటర్ల మేర ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో రోడ్లు ఉన్నాయి. 25,634 కిలో మీటర్లు బీటీ రోడ్లు, 882 కిలో మీటర్ల సీసీ రోడ్లు, 316 కిలోమీటర్ల మెటల్ రోడ్లు, 903 కిలో మీటర్ల నాన్ మెటల్ రోడ్లు ఉన్నాయి.
దేశ వ్యాపితంగా ప్రతిఏడాది లక్షా80వేల మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా రోడ్డు ప్రమాదాల్లో ప్రతిఏడాది 10వేల నుండి 15వేల వరకు మరణిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ తరపున అనేక కాలేజీల్లో, స్కూల్స్‌లో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. రోడ్లపై వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్లు ధరించడం, కారులో సీటు బెల్టు పెట్టుకోవడం, స్పీడ్ కంట్రోల్‌లో ఉంచుకోవడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను, మరణాలను నివారించడానికి అవకాశం ఉంటుంది. హైదరాబాదులో రోజురోజుకూ ట్రాఫిక్ పెరిగిపోవడం వలన వాహనదారుల సమయం, ఇంధనం ఖర్చు పెరిగిపోతుండడం ఆందోళనకరంగా మారుతున్నది. రద్దీ సమయాల్లో పోలీసు శాఖ వారు ట్రాఫిక్ నియంత్రణపై కేంద్రీకరించకుండా ప్రజలపై చలాన్లు విధించడంపైనే ఉత్సాహం చూపిస్తున్నట్లుగా కనపడుతున్నది. అంతేకాకుండా ట్రాఫిక్ కష్టాలకు వాహనాల సంఖ్య కాకుండా, రోడ్ల నిర్వ హణ అస్తవ్యస్తంగా ఉంటున్నది. కొత్తగా రోడ్లు వేసిన మరుక్షణం ఇతర శాఖలు, డ్రయినేజీ పేరుతో, ఎలక్ట్రికల్ లైన్ల పేరుతో కేబుల్ లైన్ల పేరుతో ఇష్టం వచ్చినట్లు రోడ్లను తవ్వేసి సకాలంలో వాటిని పూడ్చడానికి ప్రయత్నాలు జరగడంలేదు. దానికి కారణం ఆయా శాఖల మధ్య సమన్వయం లేకుండా పనిచేయడమే కారణంగా తెలుస్తున్నది. చాలాచోట్ల రోడ్లు వేసిన తర్వాత డ్రయినేజీ మూతల దగ్గర రోడ్లకు సమాంతరంగా నిర్వహించకపోవడం వలన రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నెమ్మదించడం లాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. రోడ్ల నిర్వహణలో కూడా ప్రధాన రోడ్లు మినహా, అంతర్గత రోడ్ల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రోడ్లపై ఇష్టం వచ్చినట్లుగా స్పీడ్ బ్రేకర్లు వేయడం, జీబ్రాలైన్లు కరెక్టుగా వేయక పోవడం, ట్రాఫిక్ లైట్ల వద్ద స్టాప్ లైన్లకు సరైన రంగులు వేయడం లాంటి చర్యలపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.
వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు వాహన లైసెన్సులు, పార్కింగ్ ప్రదేశాలను తనిఖీలు నిర్వహించాలని, హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు అమ్మరాదనే సూచనలు కూడా పాటించాల్సిన అవసరం ఉన్నది. మాదాపూర్, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో అతి చిన్నరోడ్లు ఉన్న ప్రాంతాల్లో హైరైజ్ బిల్డింగ్‌లకు, 30, 40 అంతస్తుల అపార్ట్‌మెంట్‌లకు పర్మిషన్లు ఇస్తూ, ఒక్కొక్క ప్రాంతం నుండి ఉదయం, సాయంత్రం సమయాల్లో ఒకే ప్రాంతం నుండి వేలాదిగా వాహనాలు రావడం ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతుంది. బిల్డింగ్‌లు కట్టే సమయంలో రోడ్లు, డ్రయినేజీల పేరుతో, నీటి సరఫరా లైన్ల పేరుతో, కేబుల్స్ పేరుతో రోడ్లను తవ్వి ట్రాఫిక్ ఇబ్బందులకు గురిచేస్తున్న ట్లుగా తెలుస్తున్నది. ఈ విషయంలో కూడా శాఖల మధ్య సమన్వయం చాలా అవసరం ఉన్నది. కరోనా వ్యాధి తర్వాత వ్యక్తిగత వాహనాల వినియోగం పెరిగి ట్రాఫిక్ జామ్‌లకు కారణంగా తెలుస్తున్నది. ట్రాఫిక్ పెరగడం మూలంగా కాలుష్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. వ్యక్తిగత వాహనాల వినియోగం తగ్గించడా నికి ప్రజా రవాణాను మెరుగుపరచాలి. గతంలో తగ్గించిన ఆర్‌టీసీ బస్సులను పునరుద్ధరిస్తూ కొత్త బస్సుల సంఖ్యను పెంచాలి. నగరం చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలకు సౌకర్యంగా ఉన్న ఎంఎంటీఎస్ రైళ్ల సంఖ్యను, ట్రిప్పులను పెంచాలి. అలాగే పట్టణంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన మెట్రో సేవలను ఇతర ప్రాంతాలకు విస్తరించడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను కొంత మేరకు తగ్గించే అవకాశం ఉంటుంది.
పై విషయాలపై చర్యలు ముగిసిన అనంతరం వెంటనే పోలీసు అధికారులు, రిజర్వు కానిస్టేబుల్స్‌గా ఉన్న వారిని 350 మందికి పైగా ట్రాఫిక్ నియంత్రణకు కేటాయించడం అభినందించతగ్గ విషయం. రోడ్ల భద్రత ఒక్క పోలీసుల సమస్యగా చూడకుండా, ప్రభుత్వంలోని అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించడం, మేధావులను, పౌర సంఘాలను, విద్యావేత్తలను కూడా సమీకరించి, వారి సూచనలను, సలహాలను తీసుకోవడం ద్వారా రాబోయే రోజుల్లో రోడ్డు ప్రమాదాలను నివారించడం ద్వారా, మరణాలను తగ్గించడం, పర్యావరణ సమస్యలను తగ్గించడానికి కృషి జరగాలని, ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాల్సిన అసరం ఎంతైనా ఉన్నది.
– డి.జి.నరసింహారావు, 9490098540