– బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్
– కొండా సురేఖకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదంటూ వ్యాఖ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విద్యాశాఖపై ఏమాత్రం అవగాహన లేదని బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. అందువల్లే మతిస్థిమితం లేని మంత్రులతో తనపై లేనిపోని ఆరోపణలు చేయిస్తున్నారని ఎద్దేవా చేశారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… మంత్రి కొండా సురేఖను తెలంగాణ సమాజం తిరస్కరించిందని అన్నారు. అయినా ఆమె సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సురేఖకు మంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదంటూ ఘాటుగా విమర్శించారు. గురకులాలపై సీఎంకు, మంత్రులకు ఎలాంటి శ్రద్ధ లేదని వాపోయారు. అందువల్లే ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరుగుతున్నా, పిల్లలు చనిపోతున్నా పట్టించుకోవటం లేదన్నారు. గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ ఘటనల్లో తన హస్తముందంటూ మంత్రి సురేఖ చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. తాను తప్పు చేశానని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని తెలిపారు. మంత్రి సీతక్క కూడా మూలాలు మరిచిపోయి మాట్లాడుతున్నారంటూ ఆయన విమర్శించారు.