సీఎంకు జాతరపై పట్టింపేది…?

– 26 వ తేదీన జరిగే మేళ చెర్వు జాతరకు కోటి విడుదల,
– 16 న జరిగే పెద్దగట్టు జాతరకు విడుదల కానీ నిధులు,
– 10 కోట్లు మంజూరుకు కృషి చేస్తానని చెప్పిన టూరిజం శాఖ చైర్మన్ రమేష్ రెడ్డి
– జిల్లా నుండి సిఎంను కలవని నేతలు
– సీఎంకు వినతిపత్రం అందజేసిన ఎంపీ రఘువీర్ రెడ్డి
నవతెలంగాణ – సూర్యాపేట
సమ్మక్క సారక్క జాతర తర్వాత రాష్ట్రంలో అతి రెండవ పెద్ద జాతరగా పేరుగాంచిన శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టు జాతర అభివృద్ధి నిధుల విడుదలపై జిల్లాలో ఎవ్వరికీ కూడా పట్టింపు కనిపించని పరిస్థితి నెలకొంది. జాతర ఏర్పాటు కోసం అవసరమైన నిధులను విడుదల చేయించేందుకు  జిల్లాలో ఉన్న ప్రోటాకల్ నాయకులతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్ర నేతలు ముఖ్యమంత్రిని కలవడంలో విఫలమయ్యారు.ఫిబ్రవరి రెండవ తేదీన దిష్టి పూజ జరుగనుంది.అదేవిధంగా 16 వ తేదీన జాతర షురూ కానున్నది.ఐదు రోజుల పాటు జరిగే పెద్దగట్టు జాతర కు దేశంలోని పలు రాష్ట్రాల నుండి దాదాపుగా 20 లక్షల మందికి పైగా భక్తులు హాజరుకానున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని పలు డిపార్ట్మెంట్ లకు చెందిన అధికారులు జాతర ఏర్పాట్లపై దాదాపుగా ఆరు కోట్లకు పైగా  ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి పంపారు.దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాoటి స్పందన్న లేదు.అదేవిధంగా జిల్లాకు చెందిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పట్టిపట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది. ఇంతవరకు ఆయన జాతర ఏర్పాట్లపై సమీక్షలు కూడా పెట్టక పోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇక ముఖ్యమంత్రిని కలవాల్సిన జిల్లా నాయకులు తమ బాధ్యతల్ని నిర్వర్తించకపోవడం, జాతర ప్రత్యేకతను ప్రభుత్వానికి చేరవేయడంలో విఫలమవడం ప్రజలకు అసంతృప్తిని కలిగిస్తోంది.ఇదే సందర్భంలో  మేళ చెర్వులో ఫిబ్రవరి 26న జరగబోయే జాతరకు ప్రభుత్వం ఒక కోటి రూపాయల నిధులను విడుదల చేసింది.ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గురువారం నిధులు విడుదల పై ప్రకటన చేసిన విషయం తెల్సిందే. కానీ, అదే నెల 16న జరగబోయే అత్యంత ప్రాచీనమైన  పెద్ద జాతరకు ఇప్పటి వరకు నిధుల మంజూరు జరుగలేదు. ప్రజలు తాము కొలిచే దేవతల పండుగ కోసం ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎప్పుడో జరిగే మేళ చెర్వు జాతరకు నిధులు విడుదల చేస్తూ, మరింత ప్రతిష్టాత్మకమైన పెద్దగట్టు జాతరను నిర్లక్ష్యం చేయడం చర్చనీయాంశంగా మారింది. జాతరను పట్టించుకోకపోవడం చాలా మంది లోకల్ నాయకుల పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తింది. స్థానిక నాయకుల మౌనమే ఈ పరిస్థితికి కారణమని ప్రజలు ఆరోపిస్తున్నారు.
జాతరకు 10 కోట్ల విడుదలకై విజ్ఞప్తి….టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి
గత డిశంబర్ 26వ తేదీన పెద్దగట్టు ను పటేల్ రమేష్ రెడ్డి సందర్షించిన సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లతో  మాట్లాడి జాతరకు 10 కోట్ల రూపాయల నిధులు కావాలని కోరడం జరిగిందని అన్నారు. పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ గా తాను గుట్ట అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి 10 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయాలని కోరినట్లు చెప్పారు. ఇప్పటికే జాతరకు చేయవలసిన ఏర్పాట్లపై జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ  సలహాదారు వేం నరేందర్ రెడ్డి, సిఎం రేవంత్ రెడ్డితో మాడ్లాడినట్లు చెప్పారు. ఈ మాటలు ఆయన అని నెల రోజులు దాటినప్పటికి ఇంతవరకు నిధులు విడుదల కు నోచుకోలేదు. అయితే, ఈ హామీ ప్రాక్టికల్‌గా అమలు కావాల్సి ఉంది.
పెద్దగట్టు జాతరకు నిధులు కేటాయించాలని వినతి…..ఎంపీ రఘువీర్ రెడ్డి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నిర్వహించే పెద్దగట్టు(గొల్లగట్టు) జాతరకు భారీగా నిధులు కేటాయించాలని నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఈ మేరకు విన్నవించారు. వినతిపత్రంలో జాతర ప్రత్యేకత, దాని చరిత్ర, క్రమంగా పెరుగుతున్న ప్రాముఖ్యత, జాతరకు వచ్చే భక్తుల సంఖ్య తదితర వివరాలను పేర్కొనడం జరిగింది. ఈ ఆధారంగా తగిన నిధులు మంజూరు చేయాలని కోరారు.
స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఫిబ్రవరి 16 నుంచి పెద్దగట్టు జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లకు కావాల్సిన నిధుల ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.ఇప్పుడు ఈ వినతిపత్రం ద్వారా ప్రభుత్వం స్పందించి, తగిన నిధులు విడుదల చేస్తుందా లేదా అనే విషయం చూడాల్సి ఉంది.
ప్రజల్లో, యాదవ కులస్తులో అసంతృప్తి….
ప్రజలు ఈ జాతరను దైవసంబంధమైన పవిత్ర వేడుకగా భావిస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి వచ్చే ఈ జాతరలో భాగంగా లక్షలాది మంది భక్తులు తమ నమ్మకాలను చూపుతూ పూజలు నిర్వహిస్తారు.అయితే ఈసారి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రజలలో,యాదవ కులస్తులలో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. ఇప్పుడు ప్రభుత్వం స్పందించి తగిన నిధులు విడుదల చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.అంతేకాదు, ప్రజలు ఈ అంశాన్ని పెద్ద ఎత్తున చర్చించుకుంటూ, తమ సమస్యలను మీడియా ద్వారా బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ జాతరకు కావాల్సిన మౌలిక వసతులు కల్పించకుండా ప్రభుత్వం తమ బాధ్యతలను విస్మరించిందని, వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.