– అంగన్‌వాడీల సమ్మె న్యాయ సమ్మతమైంది : సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
అమరావతి : అంగన్‌వాడీల సమస్యలు వింటారో లేదో సీఎం జగన్ తేల్చుకోవాలని, వారి పోరాటం న్యాయ సమ్మతమైందని, ఇప్పటికైనా పరిష్కరించకపోతే ప్రభుత్వాన్ని ఉంచాలో లేదో అంగన్‌వాడీలే తేలుస్తారని సీపీఐ(ఎం) ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు హెచ్చరించారు. అంగన్‌వాడీల నిరవధిక నిరాహార దీక్షలు ఐదోరోజుకు చేరిన నేపథ్యంలో వామపక్షాల ఆధ్వర్యాన ఆదివారం ఉదయం విజయవాడలో దీక్షా శిబిరం వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. మహిళా శక్తికి మించింది మరొకటి లేదని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా వారిని నిరాహార దీక్ష చేసే వరకూ తీసుకెళ్లిన సీఎం.. అంగన్‌వాడీల సమస్యలు విని పరిష్కరిస్తారో లేదో తేల్చుకోవాలన్నారు. వారితో పెట్టుకున్న ప్రభుత్వాలేవీ ఇంతవరకు నిలబడిన దాఖలాలు లేవని ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని అన్నారు. అంగన్‌వాడీలు సోమవారం తలపెట్టిన జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.