పార్లమెంటు ఎన్నికల్లో 12కు తగ్గకుండా గెలవాలి : సీఎం

పార్లమెంటు ఎన్నికల్లో 12కు తగ్గకుండా గెలవాలి : సీఎంనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాలకుగాను 12కు తగ్గకుండా గెలిచేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి సూచించారు. సోమవారం హైదరాబాద్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జిల్లాల ఇంచార్జ్‌ మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, మహబూబ్‌ నగర్‌, హైదరాబాద్‌ నేతలతో ఆయన భేటీ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో కంటే ఎంపీ ఎలక్షన్లలో ఎక్కువ ఓట్లు సాధించేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల్లో పర్యటిస్తాననీ, ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ ఉంటుందని తెలిపారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక తొలి సభను ఇంద్రవెల్లిలో రేవంత్‌ రెడ్డి నిర్వహించిన విషయం తెలిసిందే. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలి బహిరంగ సభను ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నట్టు తెలిపారు. అక్కడ అమరుల స్మారక స్మృతివనానికి శంఖుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్‌ నేతలకు సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలను ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్‌ మంత్రులకు అప్పగిస్తామనీ, సంక్షేమం, అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని భరోసానిచ్చారు. తాను గత సీఎంలా కాదని తేల్చి చెప్పారు. జనవరి 26 తర్వాత ఎ ప్రతి వారం మూడు రోజుల పాటు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటలవరకు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో రెట్టింపు ఉత్సాహంతో పని చేయాలని నేతలకు సూచించారు.