నేడు మొబైల్‌ యాప్‌ను ఆవిష్కరించనున్న సీఎం

– 6 నుంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ : మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
అర్హులైన లబ్దిదారుల ఎంపికను పారదర్శకంగా చేసేందుకు వీలుగా మొబైల్‌ యాప్‌ను రూపొందించామని రాష్ట్ర రెవెన్యూ, పౌరసంబంధాల శాఖ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ యాప్‌ను గురువారం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఆవిష్కరిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. లబ్దిదారులు ఆర్థిక, ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి స్వరూపం, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి నిర్మాణానికి సంబంధించిన భూమి వివరాలు వంటి అంశాలు యాప్‌లో పొందుపరుస్తామని తెలిపారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేందుకు వీలుగా ప్రతి గ్రామం, వార్డుల్లో ఇందిరమ్మ ఇండ్ల కమిటీలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇండ్ల పథకం అమలుకు ఉన్న అవరోధాలను అధిగ మిస్తూ…అవసరమైన కార్యాచరణను వేగవంతం చేసినట్టు వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ఒక్కో ఇంటికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్టు పేర్నొన్నారు. మహిళల పేరిట ఇండ్లను మంజూరు చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు వచ్చే నాలుగు సంవత్సరాల్లో దశల వారీగా సుమారు 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం పూనుకుందని పేర్కొన్నారు.వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాథలు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లు, సఫాయి కర్మాచారులకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని వివరించారు.