రెగ్యులరైజ్‌పై సీఎం హామీని నిలబెట్టుకోవాలి

– యూనివర్సిటీస్‌ కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్‌
– ఉన్నత విద్యామండలి ముట్టడి
– పలువురు అరెస్ట్‌
నవతెలంగాణ-ఓయూ
తమ సర్వీసును రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ యూనివర్సిటీల కాంట్రాక్టు అధ్యాపకులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర యూనివర్సిటీల కాంట్రాక్ట్‌ టీచర్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నుంచి తరలివచ్చిన కాంట్రాక్ట్‌ అధ్యాపకులు కౌన్సిల్‌ ఆఫీసులోకి దూసుకెళ్లి తమను రెగ్యులర్‌ చేసే వరకు కదిలేది లేదని అక్కడే బైటాయించి నినదించారు. సీఎం కేసీఆర్‌ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని జైల్‌, డీఎల్‌, పీఎల్‌లను రెగ్యులర్‌ చేసినట్టుగా యూనివర్సిటీ అధ్యాపకులను కూడా చేయాలని కోరారు. పోలీసులు వారిని అరెస్టు నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.ఈ సందర్భంగా పలువురు అధ్యాపకులు మాట్లాడుతూ.. ఈ అక్రమ అరెస్టులు ఖండిస్తున్నామన్నారు. అనేక సంవత్సరాలుగా విశ్వవిద్యాలయంలో పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం రెగ్యులరైజ్‌ చేయకుండా విస్మరించడం బాధాకరమన్నారు. సీఎం కేసీఆర్‌ ఇప్పటికైనా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. జేఏసీ స్టేట్‌ చైర్మెన్‌ డా.వేల్పుల కుమార్‌, ఓయూ జేఏసీ చైర్మెన్‌ డా.ఈ. ఉపేందర్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.వెంకటేశం, జేఏసీ కన్వీనర్‌ డాక్టర్‌ చిర్రారాజు, ఓయూ కన్వీనర్‌ స్రవంతి రెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ కృష్ణయ్య అరెస్టయిన వారిలో ఉన్నారు.