– 10 బ్యాంక్‌ల రేటింగ్‌కు మూడీస్ కోత
– మరిన్ని విత్త సంస్థలకు హెచ్చరిక
వాషింగ్టన్ :అమెరికన్ బ్యాంక్‌ల పరపతి దెబ్బతింటుంది. అక్కడి ఆర్థిక వ్యవస్థలోని లోపాలు విత్త సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలోనూ మూడు, నాలుగు బ్యాంక్‌లు దివాలా అంచునకు చేరిన విషయం తెలిసిందే. తాజాగా గ్లోబల్ రేటింగ్ ఎజెన్సీ మూడీస్ అమెరికాకు చెందిన 10 బ్యాంక్‌ల పరపతికి కోత పెట్టింది. మరిన్ని బ్యాంక్‌ల రేటింగ్‌ను తగ్గిస్తామని హెచ్చరించింది. దేశంలోని కొన్ని అతిపెద్ద రుణదాతల స్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపింది. స్థూలంగా 27 బ్యాంక్‌లపై అంచనాలను విడుదల చేసింది. దేశంలోని ఎంఅండ్‌టీ బ్యాంక్, పినాకిల్ ఫైనాన్సీయల్ పార్ట్‌నర్స్, ప్రాస్పిరిటీ బ్యాంక్, బీఓకే ఫైనాన్సీయల్ కార్ప్ సంస్థల రేటింగ్‌కు కోత పెట్టింది. మరోవైపు బీఎన్‌వై మెల్లన్, యూఎస్ బన్‌కార్ప్, స్టేట్‌స్ట్రీట్, ట్రూయిస్ట్ ఫైనాన్సీయల్ విత్త సంస్థలను డౌన్‌గ్రేడ్ కోసం సమీక్షాలో ఉంచినట్లు మూడీస్ వెల్లడించింది. ”చాలా బ్యాంకులు జూన్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో లాభదాయకత ఒత్తిళ్లను చవి చూశాయి. ఇది అంతర్గత మూలధనాన్ని ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఇది స్వల్ప మాంద్యం కారణంగా వస్తుంది. బ్యాంకులు వడ్డీ రేట్లు, వారి ఆస్తులు, బాధ్యతలను నిర్వహించడం వల్ల ఎక్కువ నష్టాలను ఎదుర్కొంటున్నాయి” అని మూడీస్ విశ్లేషించింది. ఈ ఏడాది ప్రారంభంలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగేచర్ బ్యాంక్ పతనం అమెరికా బ్యాంకింగ్ రంగంపై విశ్వాసాన్ని సన్నగిల్లేలా చేశాయి. ఈ పరిణామాలు అక్కడి సంక్షోభానికి అద్దం పట్టాయి. విశ్వాసాన్ని పెంచడానికి అధికారులు అత్యవసర చర్యలను ప్రారంభించినప్పటికీ.. ప్రాంతీయ బ్యాంకుల్లో డిపాజిట్లను ఉపసంహరించుకోవడానికి ప్రజలు పరుగులు పెట్టారు.