నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్
నల్గొండ జిల్లాలో మాదకద్రవ్యాలు ఏ రూపంలో ఉన్న నియంత్రించాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు.ఇందులో భాగంగా మాదక ద్రవ్యాల నియంత్రణపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.గురువారం తన చాంబర్లో జిల్లా ఎస్పీ శరథ్ చంద్ర పవార్ తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి నార్కో కో- ఆర్డినేషన్ సెంటర్ కమిటీ (ఎన్ కార్డ్ ) (మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ) సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ పోలీసు తో పాటు, ఇతర సంబంధిత శాఖలన్నీ సంపూర్ణ సహకారం అందించినప్పుడే పూర్తిస్థాయిలో మాదక ద్రవ్యాలను నియంత్రించే అవకాశం ఉందని అన్నారు.వచ్చేవారం ప్రత్యేకించి నల్గొండ జిల్లాలోగంజాయి వ్యతిరేక వారోత్సవం నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. గంజాయి వ్యతిరేక వారోత్సవం భాగంగా ప్రజలలో అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు,పోస్టర్లు, హోర్డింగులు, ఏర్పాటు చేయాలని, ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా, సామాజిక మాధ్యమాలు,సినిమా థియేటర్లు,స్థానిక కేబుల్ చానల్లలో గంజాయి వినియోగం వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు వివరించాలని అన్నారు. కళాజాత బృందాలు,ర్యాలీలు,సమావేశాలు,విద్యార్థులకు వివిధ రకాల పోటీలను నిర్వహించాలని,గ్రామ,మండల,మున్సిపల్ స్థాయిలలో కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆగస్టు 7 నుండి అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు సంబంధించిన శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామాలలో గ్రామస్థాయి సమావేశం నిర్వహించి ర్యాలీ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని, పాఠశాలల,కళాశాల విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీల వంటివి నిర్వహించాలని, మరుసటి రోజు 2 కె రన్ నిర్వహించాలని చెప్పారు.
సోమవారం మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ఈ అంశంపై ప్రత్యేకించి అవగాహన కల్పించాలని సూచించారు.అంతేకాక స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గంజాయి పై ప్రత్యేకించి ఒక శకటాన్ని, స్టాల్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాలు, ప్రత్యేకించి గంజాయి వినియోగం ,రవాణా ఎక్కువగా ఉందని, జాతీయ రహదారి నిడివి సుమారు 70 కిలోమీటర్లు ఉండడం,గంజాయి రవాణాకు అనుకూలంగా ఉన్నందున గంజాయి రవాణా జరుగుతున్నదని తెలిపారు. గంజాయిని నియంత్రించేందుకు జిల్లాలో మిషన్ పరివర్తన ద్వారా పోలీసు శాఖ ప్రతి గ్రామానికి ఒక పోలీస్ అధికారిని ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నప్పటికీ ,ఇతర శాఖల సహకారం తప్పనిసరి అని అన్నారు. గంజాయి తీసుకొని ఆరోగ్యం పాడైన వారికోసం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా డి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, ఎక్కడైనా పొలాలు,అటవీ ప్రాంతంలో గంజాయి పండించినట్లయితే వాటిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించేలా వ్యవసాయ, అటవీ శాఖలు సహకారం అందించాలని కోరారు. ఇందుకు పోలీసు శాఖ తరఫున అవసరమైన సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని చెప్పారు. అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, నల్గొండ, దేవరకొండ, ఆర్డిఓ లు రవి, శ్రీరాములు, డిఆర్డిఓ నాగిరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కళ్యాణ చక్రవర్తి, డిఈఓ బిక్షపతి, డిఐఈఓ దశ్రు నాయక్, జిల్లా వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హుస్సేన్ బాబు, అటవీ, పోలీస్, రెవెన్యూ అధికారులు, మండలాల తహసిల్దారులు హాజరయ్యారు.