మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకోవాలి: కలెక్టర్

నవతెలంగాణ – సిరిసిల్ల
వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన  మొక్కలు నాటే లక్ష్యాన్ని చేరుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా జిల్లాలో మొక్కలు నాటడం, దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం పై పలు శాఖలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లోని కాన్ఫరెన్స్ హాలులో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలోని వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు పక్కా ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. గతంలో నాటిన మొక్కలు ఎండిపోయిన, పెరగకపోయిన వాటి స్థానంలో ఇప్పుడు వన మహోత్సవంలో భాగంగా నాటాలని పిలుపు నిచ్చారు. నాటిన మొక్కలకు తప్పకుండా జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. మొక్కలను నిత్యం పర్యవేక్షిస్తూ వాటిని సంరక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. వన మహోత్సవంలో భాగంగా ఆయా శాఖలకు కేటాయించిన మొక్కల లక్ష్యాలు ఇలా ఉన్నాయి. డీఆర్డీఓ శాఖకు 5,00,000 లక్షలు, అటవీ శాఖకు 1,00,000, సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి 50,000, వేములవాడ మున్సిపాలిటీ, వ్యవసాయ శాఖ, ఎక్సైజ్ శాఖకు 20 వేల చొప్పున, ఆర్ అండ్ బీ, నీటి పారుదల శాఖకు 10 వేల చొప్పున, విద్యాశాఖకు 6 వేలు, వైద్య ఆరోగ్య శాఖ, పోలీస్ శాఖ, ఉద్యానవన శాఖకు 5 వేల చొప్పున, మైనింగ్ శాఖ, పౌరసరఫరాల శాఖ, పరిశ్రమల శాఖ, దేవదాయ శాఖ, సెస్ మైనార్టీ సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖకు వెయ్యి చొప్పున మొక్కలు నాటే లక్ష్యాన్ని నిర్ణయించారు. మొత్తం 7,58,000 గా లక్ష్యాన్ని నిర్ణయించామని కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, డీఆర్డీఓ శేషాద్రి, డీఈవో రమేష్ కుమార్, పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి జితేందర్ రెడ్డి, ఉద్యానవన శాఖ జిల్లా అధికారి జ్యోతి, డీఏఓ భాస్కర్, జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి పంచాక్షరి, డీఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు, నీటి పారుదల శాఖ ఈఈ సంత్ ప్రకాశ్ రావు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కమిషనర్లు లావణ్య, అన్వేష్, మైనార్టీ సంక్షేమ శాఖ ఓఎస్డీ సర్వర్ మియా, ఎఫ్ఆర్ఓ శ్రీనివాస్,  అధికారులు తదితరులు పాల్గొన్నారు.