కౌంటింగ్ సెంటర్ వద్ద ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

నవతెలంగాణ – కంటేశ్వర్
పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా ఓట్ల లెక్కింపు కేంద్రమైన సీఎంసీ కళాశాలలో కొనసాగుతున్న ఏర్పాట్లను, చేపడుతున్న పనులను సోమవారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నిజామాబాద్ అర్బన్, రూరల్, బోధన్, ఆర్మూర్, బాల్కొండ, కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్లలో పోల్ అయ్యే ఓట్లను సీ.ఎం.సీలోనే లెక్కించనున్న నేపథ్యంలో పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పాటు, నిజామాబాద్ అర్బన్, రూరల్ సెగ్మెంట్ల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ లను కూడా సీ.ఎం.సీలోనే చేపట్టనున్న సందర్భంగా సంబంధిత గదులను కలెక్టర్ పరిశీలించారు. ఓట్ల లెక్కింపు, పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూమ్ ల వద్ద చేపడుతున్న ఏర్పాట్లు, వసతులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. భద్రతాపరమైన అంశాలను నిశితంగా పరిశీలిస్తూ, అవసరమైన మార్పులు, చేర్పులు యుద్ధప్రాతిపదికన చేపట్టి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, విద్యుత్, ఫైర్ అలారమ్స్ ఇతర అన్ని ఏర్పాట్లను చక్కబెట్టాలని సూచించారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద నిరంతర పర్యవేక్షణ కోసం సిసి కెమెరాలను ఏర్పాటు చేసి తగిన బందోబస్తు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున, అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని, ప్రతి కౌంటింగ్ హాల్ వారీగా అవసరమైన వాటిని గుర్తిస్తూ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.  స్ట్రాంగ్ రూమ్ లు, కౌంటింగ్ హాల్ లలో వాటర్ లీకేజీలు లేకుండా చూసుకోవాలని, అగ్ని ప్రమాదాలు వంటి వాటికి ఆస్కారం లేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని చోట్ల విద్యుత్ వసతి, ఫ్యాన్లు, లైట్లు పని చేస్తున్నాయా లేదా అన్నది పక్కాగా నిర్ధారణ చేసుకోవాలని తన వెంట ఉన్న ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్, ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖ అధికారులకు సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ హాల్ తో పాటు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేయించాలని, ఎక్కడ కూడా చెత్తాచెదారం ఉండకూడదని అన్నారు. మరమ్మతు పనులను వేగవంతంగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ కిరణ్మయి, ఏ.సీ.పీ రాజా వెంకట్ రెడ్డి, మెప్మా పీ.డీ రాజేందర్, ట్రాన్స్కో ఎస్.ఈ రవీందర్, ఏ.డీ.ఈ రాజశేఖర్, కార్మిక శాఖ అధికారి యోహాన్, ఈ.డీ.ఎం కార్తీక్ తదితరులు ఉన్నారు.