పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి: కలెక్టర్

– యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండాగే…
నవతెలంగాణ – భువనగిరి రూరల్ 
ఈనెల 18వ తేదీ నుండి జరిగే పదవ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు  కే జండగే సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18 వ తేదీ నుండి వచ్చే ఏప్రిల్  2 వ తేదీ వరకు జిల్లాలో 51 పరీక్షా కేంద్రాలలో ఉదయం 9.30 AM నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు నిర్వహించబడుతాయని, పదవ తరగతి పరీక్షల పకడ్బందీ నిర్వహణకు గాను ప్రతి పరీక్షా కేంద్రానికి ఒకటి చొప్పున 51 సెట్టింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని, క్షేత్ర స్థాయి పర్యవేక్షణకు మూడు ఫ్లైయింగ్ స్క్వాడులను ఏర్పాటు చేయడం జరిగిందని, తహశీల్దార్లు పరీక్షా సమయాలలో సంబంధిత పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించాలని, పరీక్షా సమయాలలో ఉదయం 09.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షా కేంద్రాలు, మండల ప్రధాన కార్యాలయాల సమీపం లోని జిరాక్స్ దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. జిల్లా లోని అన్ని పరీక్షా కేంద్రాల  వద్ద అవసరమైన మందులతో వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని, అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ను సిద్ధంగా ఉంచాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని ఆదేశించారు. పరీక్షా సమయాలలో అన్ని పరీక్షా కేంద్రాలకు అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ సరఫరాను అందించాలని విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీరును ఆదేశించారు. సకాలంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సౌకర్యార్థం ఉదయం బస్సుల ఫ్రీక్వెన్సీని పెంచాలని, పరీక్షా కేంద్రాలకు అదనంగా ప్రత్యేక బస్సులను నడపాలని యాదగిరిగుట్ట డిపో మేనేజర్ ను ఆదేశించారు.