సెలవులు ముగిసేలోగా మరమ్మతు పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

– వట్టెంల, ఫాజుల్ నగర్లో  పాఠశాలలను పరిశీలించిన కలెక్టర్ అనురాగ్ జయంతి..
నవతెలంగాణ – వేములవాడ రూరల్
వేసవి సెలవులు ముగిసేలోగా ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల మరమ్మతు పనులు పూర్తి చేయాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కింద వేములవాడ రూరల్ మండలం లోని వట్టెంల, ఫాజుల్ నగర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చేయనున్న మరమ్మతు పనుల ప్రణాళికను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమి తో కలిసి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయా స్కూల్ లలో తరగతి గదులు, మరుగు దొడ్లు, నీటి వసతి, విద్యుత్ సౌకర్యాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మ ఆదర్శ పాఠశాల కింద తరగతి గదులు, మరుగు దొడ్ల లో మరమ్మతు పనులు చేయించాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తాగు నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. తరగతి గదులలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని వివరించారు. ఆయా పనులు త్వరగా మొదలు పెట్టి నాణ్యతా ప్రమాణాల ప్రకారం పూర్తి చేయించాలని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు. ఆయన వెంట జడ్పీ సీఈవో ఉమారాణి, డీఈఓ రమేష్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.