
– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి
నవతెలంగాణ – వీర్నపల్లి
వేసవి సెలవులు ముగిసి స్కూళ్లు ప్రారంభమయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మరమ్మతు పనులు పూర్తి కావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట,మండలంలోని దుమాల, అల్మాస్ పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు,వీర్నపల్లి మండలం కంచర్ల మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, గర్జనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేయనున్న మరమ్మతు పనుల ప్రణాళికను కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ పూజారి గౌతమితో కలిసి శుక్రవారం పరిశీలించారు. అనంతరం ఆయా స్కూల్ లలో తరగతి గదులు, మరుగు దొడ్లు, నీటి వసతి, విద్యుత్ సౌకర్యాలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మ ఆదర్శ పాఠశాల కింద తరగతి గదులు, మరుగు దొడ్ల లో మరమ్మతు పనులు చేయించాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా తాగు నీటి వసతి కల్పించాలని ఆదేశించారు. తరగతి గదులలో ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని వివరించారు. ఆయా పనులు త్వరగా మొదలు పెట్టి నాణ్యతా ప్రమాణాల ప్రకారం పూర్తి చేయించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఇక్కడ టీఎస్ఈ డబ్ల్యూఐడీసీ ఈఈ అనిత సింగనాథన్, జడ్పీ డిప్యూటీ సీఈవో గీత, డీఈఓ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.