– జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్
– విద్యార్ధినిలతో కలసి వసతి గృహంలో బస
నవతెలంగాణ – సారంగాపూర్
మండలంలోని జామ్ బాలికల సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని గురువారం రాత్రి కలెక్టర్ అభిలాష్ అభియాన్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ వసతిగృహ విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు రాత్రి వేళల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున నిర్దిష్ట ప్రణాళికను సిద్ధం చేసుకుని, ప్రణాళిక ప్రకారం చదవాలని సూచించారు. జీవితంలో ఉన్నతంగా ఎదగాలంటే ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరుచుకోవాలన్నారు. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థులను ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టారు. అనంతరం విద్యార్థులు, అధికారులతో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేసి అక్కడే బస చారు. ముందుగా పిల్లలతో ముచ్చటిస్తూ వారి బాగోగులను వాకబు చేశారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు వచ్చినా వెంటనే ఉపాధ్యాయుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ, పరిసరాల పరిశుభ్రతకై ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు. రోజూ వారి జీవన విధానంలో సరైన సమయ పాలనను పాటించాలన్నారు. జీవితంలో విద్యతోపాటు క్రీడలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వాలని సూచించారు. వంట గదిని పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాలతో కూడిన భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. నాణ్యమైన వస్తువులు, కూరగాయలను మాత్రమే వినియోగించాలన్నారు. వంటగది, స్టోర్ రూమ్, మరుగుదొడ్లు, రీడింగ్ రూమ్ లు, విద్యార్థుల వసతి గదులను కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ పరిశీలనలో డీఈఓ పి.రామారావు, తహసీల్దార్ శ్రీదేవి, ఎంఈవో మధుసూదన్, ఎంపీఓ అజీజ్ ఖాన్ , ప్రధానోపాధ్యాయులు సంగీత, ఉపాధ్యాయులు, అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.