బడిబాట ద్వారా విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలి: కలెక్టర్

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
బడిబాట కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు హనుమంత్ కే జెండగే అధికారులను కోరారు. గురువారం నాడు కలెక్టరేటు కాన్ఫరెన్స్ హాలులో బడిబాట కార్యక్రమంపై వివిధ శాఖల సమన్వయ కమిటీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… వచ్చే జూన్ 3 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు జరిగే బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, బడిబాట కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధుల ప్రవేశాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైట్ టూ ఎడ్యుకేషన్ (RTE) విద్యా హక్కులో భాగంగా 6 సంవత్సరాల నుండి 14 నంవత్సరాల పిల్లలు తప్పనిసరిగా బడికి వెళ్లాలని,  అందుకోసం గ్రామాలలో, హ్యాబిటేషన్లలో పిల్లలను  గుర్తించాలని, దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని, ప్రభుత్వ బడులలో కల్పిస్తున్న వసతులను, పథకాలను, నాణ్యమైన విద్యపై తల్లిదండ్రులకు, కమ్యూనిటీ పెద్దలకు వివరించాలని, అంగన్వాడీలలో బడికి వెళ్లే పిల్లలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, బడిపిల్లల తక్కువ నమోదు ఉన్న పాఠశాలలను గుర్తించి తల్లిదండ్రులు, కమ్యూనిటీ పెద్దల సహకారంతో ప్రభుత్వ బడులలో చేర్పించాలని, మధ్యలో బడి మానేసిన పిల్లలను గమనించి అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులతో కలిసి అర్హత కలిగిన తరగతులలో వారిని తిరిగి చేర్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా అందచేసే డ్రెస్సులు, పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఉపకార వేతనాలు, డిజిటలైజేషన్ తరగతులపై తల్లిదండ్రులకు అవగాహన కలిగించేలా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని, విద్యార్ధుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. వచ్చే జూన్ 3 వ తేదీ నుండి 19 వ తేదీ వరకు జరిగే బడిబాట కార్యక్రమం కోసం మండల స్థాయి కమిటీలు ఈనెల 31 న సమావేశమై క్షేత్రస్థాయిలో కార్యక్రమాలను విజయవంతం అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అశా, అంగన్వాడీ, స్వయం సహాయక మహిళా సమాఖ్యల సమన్వయంతో ఇంటింటి ప్రచారంతో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చూడాలని తెలిపారు.
బడి బాట కార్యక్రమంలో జూన్ 3 నుండి 11 వ తేదీ వరకు ఉదయం 7 గంటల నుండి 11 గంటల వరకు ప్రతి రోజూ క్షేత్రస్థాయిలో విద్యార్ధుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని, 3 వతేదీన గ్రామ స్థాయి డ్రైవ్ చేపట్టి స్వయం సహాయక సంఘాలు, అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులతో ప్రమాణాలు, ర్యాలీలు నిర్వహించాలని, 4 వ తేదీన ప్రతి ఇంటికి వెళ్లి పాఠశాలకు వెళ్లే విద్యార్ధులను గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని, స్కూళ్లకు వెళ్లే విద్యార్ధుల వివరాలను విలేజి ఎడ్యుకేషన్ రిజిష్టర్లో నమోదు చేయాలని, 5 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే వసతుల పట్ల అవగాహన కలిగించి నమోదు చేయించాలని, 11 న గ్రామ సభల ఏర్పాటు చేయాలని అన్నారు. 12 న విద్యార్థులకు స్వాగత దినోత్సం ఏర్పాటు చేసి పాఠశాలలను అందంగా పండుగ వాతావరణంలో అలంకరించాలని, రంగోలి తదితర ఉత్సాహ కార్యక్రమాలు రూపొందించాలని, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో చేపట్టిన వసతులను వివరించాలని, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, కమ్యూనిటీ వారితో పేరెంట్ టీచర్ మీటింగ్లు ఏర్పాటు చేయాలని, చేపట్టిన పనులను ప్రారంభించాలని, టెక్స్ట్ బుక్స్, డ్రైస్సులను విద్యార్ధులకు అందచేయాలని తెలిపారు. గత విద్యా సంవత్సరంలో మంచి ప్రతిభ కనబరచిన, మంచి హాజరు కలిగిన విద్యార్థులను మెచ్చుకోవండతోపాటు అందుకు ప్రోత్సహించిన వారి తల్లిదండ్రులను సన్మానించాలని తెలిపారు. 13 న తరగతి వారిగా విద్యార్థులు తయారు చేసిన విద్యా ప్రమాణాలకు సంబంధించి పోస్టర్లను, చార్ట్ లను ప్రదర్శించి తరగతి గదులను డెకరేట్ చేయాలని తెలిపారు. 14 న సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ఏర్పాటు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల సభ్యులు, తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, కమ్యూనిటీ పెద్దలను భాగస్వామ్యం చేయాలని, పండుగ వాతావరణంలో నిర్వహించాలని సూచించారు. ఉన్నత పాఠశాలలకు సంబంధించి విద్య యొక్క ప్రాముఖ్యత, ప్రభుత్వ పాఠశాలల్లో అందిస్తున్న సౌకర్యాలపై సాంస్కృతిక కార్యక్రమాలను విద్యార్దినీ విద్యార్ధులతో ప్రదర్శించాలని, 15 తేదీన సహిత విద్య, బాలికల విద్యా దినోత్సవం జరుపుకోవాలని, బడి బాట కార్యక్రమంలో గుర్తించిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను భవిత కేంద్రాలలో, పాఠశాలల్లో చేర్పించాలని, ఈ కేటగిరిలో వారిని వంద శాతం నమోదు చేయాలని తెలిపారు. గ్రామాలలో, ఆవాసాలలో ఎటువంటి బాల కార్మికులు లేకుండా చూడాలని, గుర్తించిన వారందరిని పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 18 వ తేదీన డిజిటల్ తరగతులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, తరగతి వారిగా విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టాలని, మొక్కలు పెంచే బాధ్యతను వారికే అప్పగించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టిన విషయాన్ని ఇంటింటా చదువుల పంట అనే యాప్ గురించి తలిదండ్రులకు తెలియచెప్పాలని అన్నారు. తెలుగు, ఇంగ్లీషు భాషలలో పాఠ్య పుస్తకాలను ముద్రించి పంపిణీ చేయడం జరుగుతున్నదని, ఉపాధ్యాయులకు ఇంగ్లీషు బోధనలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తల్లిదండ్రులకు తెలియచెప్పాలని అన్నారు. 19 న క్రీడా దినం ఏర్పాటు చేసి విద్యార్ధులకు కబడ్డీ, ఖోఖో, వాలిబాల్, పుట్బాల్ తదితర ఆటల పోటీలు నిర్వహించాలని, బడిబాట కార్యక్రమాల లక్ష్యం ప్రభుత్వ బడులలో విద్యార్ధుల సంఖ్య పెంచడమేనని, వారికి నాణ్యమైన విద్య అందించడమేనని, అందుకోసం సంబంధిత శాఖలు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టరు కె గంగాధర్, భువనగిరి ఆర్డిఓ అమరేందర్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి ఎంఎ కృష్ణన్, జిల్లా విద్యాశాఖ అధికారి కే నారాయణరెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.