జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్..

The collector who unveiled the national flag..– 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు
– పోలీసుల గౌరవ వందనం స్వీకరణ. 
 నవతెలంగాణ – భువనగిరి
76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఆదివారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డీసీపీ రాజేష్ చంద్రతో కలిసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశమంతా ఆనందోత్సాహాలతో గణతంత్ర దినోత్సవాన్ని పండుగలా జరుపుకునే పర్వదినమిది అన్నారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ ను నిలుపుకునేందుకు, భారతరత్న డా. బీ.ఆర్. అంబేద్కర్ సారధ్యంలో రాయబడిన భారత రాజ్యాంగము జనవరి 26, 1950 రోజున అమలులోకి రావడంతో రిపబ్లిక్ డే వేడుకలు జరుపుకోవడం సంతోషమన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సాధించిన ప్రగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ్రు శోభారాణి, డీసీపీ రాజేష్ చంద్ర, అడిషనల్ కలెక్టర్లు వీరారెడ్డి, గంగాధర్, ఎసీపీ రాహుల్ రెడ్డి, ఆర్డీవో కృష్ణా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు  పాల్గొన్నారు. జిల్లా నివేదిక జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలను ఇతర అంశాలను జిల్లా నివేదిక ద్వారా వివరించారు. జిల్లాలో ప్రజా పాలన సేవా కేంద్రాలు 17 మున్సిపాలిటీ కార్యాలయాలు 8 కేంద్రాలు, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఒకటి మొత్తము 26 ప్రజాపాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజా పాలన సేవా కేంద్రాలకు వచ్చిన 45 వేల68 దరఖాస్తులను పరిష్కరించినట్లు తెలిపారు. మహాలక్ష్మి పథకం  ద్వారా ఆర్టీసీ బస్సులలో ఒక కోటి నాలుగు లక్షల 96,352 మహిళా ప్రయాణికులకు రూపాయలు 53 కోట్ల ఐదు లక్షల రూపాయలతో ఉచిత ప్రయాణం కల్పించడం జరిగిందన్నారు 1,24,వేల899 మంది కి మహాలక్ష్మి పథకం కింద వంట గ్యాస్ సిలిండర్లు తక్కువ ధరకు అందించడం జరిగిందన్నారు  గృహ జ్యోతి పథకం, రైతు రుణమాఫీ, రైతు భరోసా, చేయూత,  యువ వికాసం పథకాల లబ్ధిదారులను ఇతర వివరాలను తెలిపారు. సాంఘిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు. జిల్లా ప్రజలలో సాంఘిక దురాచారాలపై అన్నీ ముఖ్యమైన ప్రాంతాలలో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తూ ప్రజలలో సరియైన అవగాహన కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో పరిపాలనను  ప్రజలకు చేరువగా తీసుకెళ్ళి అభివృద్ధి ఫలాలను ప్రజలందరికి అందేటట్లు చేయడానికి సహకరిస్తున్న   ప్రతి ఒక్కరికి శుభాశీస్సులు తెలిపారు ఇదే స్పూర్తితో అందరము కలిసికట్టుగా పనిచేసి మన జిల్లా సర్వతోముఖాభివృద్ధికి పాటుపడదామన్నారు.  ఆ దిశలో మనమoదరం అంకితమై శ్రమిస్తూ. తెలంగాణ రాష్ట్రం లో యాదాద్రి భువనగిరి జిల్లా ను అగ్రగామి గా నిలుపుదామని కోరారు.  వివిధ శాఖలు ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలతో శకటాలను ఏర్పాటు చేసి ప్రదర్శించారు.