– కొత్త నేతలు వస్తున్నా… పాత నేతలు పోతున్న వైనం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేవారు వస్తుండగా… పోయేవారు పోతున్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నుంచి కీలకమైన నేతలు హస్తం గూటికి చేరుతుండగా…అది తట్టుకోలేక కొంత మంది నేతలు అసంతృప్తితో బయటకు పోతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లా జెడ్పీ వైఎస్ చైర్మెన్ బాలాజీసింగ్ ఆదివారం టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. కాంగ్రెస్‌లో చేరేందుకు సమ్మతి తెలిపారు. అనంతరం వారు బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. అక్కడి టికెటు ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి కూడా అందుకు అంగీకరించినట్టు సమాచారం. కసిరెడ్డికి కల్వకుర్తి టికెటు ఇచ్చి, ఏఐసీసీ కీలక పదవిలో ఉన్న వంశీచంద్‌ను మహబూబ్‌నగర్ పార్లమెంటు నుంచి పోటీ చేయించాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రెస్‌లో చేరితే, కల్వకుర్తిలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారనున్నట్టు చెబుతున్నారు. అందుకే పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి కూడా ఆ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అందులో భాగంగానే కొంత కాలంగా బీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న కసిరెడ్డితోనూ రేవంత్ చర్చలు జరిపారు. కారుపార్టీలో సౌమ్యుడిగా పేరొందిన బాలాజీసింగ్‌కు రెండుసార్లు టికెట్ ఇస్తామని చెప్పినప్పటీ హామీ నెరవేరలేదు. అయితే ఆయనకు జెడ్పీ వైఎస్ చైర్మెన్ పదవిని అధికార పార్టీ కట్టబెట్టింది. అయినా ఆయన సంతృప్తిగా లేరని తెలుస్తోంది. చాలా కాలంగా ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, నాయకులు బాలాజీసింగ్, గొలి శ్రీనివాసరెడ్డి మధ్య తీవ్రమైన విభేదాలు కొనసాగుతున్నాయి. రెండు వర్గాలుగా చీలిపోయిన వారు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు కూడా నలిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ నలుగురు శాంతించలేదు. జైపాల్‌యాదవ్ ఏకపక్ష దోరణి, నియంతృత్వ పోకడలు, ఇతరులను అణతొక్కాలనే పద్దతులతో విసిగిపోయినట్టు వారు పదేపదే తమ అనుయాయుల వద్ద వాపోయారు. ఈ పరిస్థితుల్లోనే తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్‌ను పార్టీలోకి తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు.
మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్‌రావు, మరోనేత నక్క ప్రభాకర్ కాంగ్రెస్‌లో చేరారు. వీరి ముగ్గురికి టికెట్లు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈనేపథ్యంలో మెదక్ అసెంబ్లీ సీటు ఆశిస్తున్న కాంగ్రెస్ నేత, మెదక్ జిల్లా అధ్యక్షులు మణికంఠ తిరుపతిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. రేవంత్‌రెడ్డికి భారీ లేఖను రాశారు. మల్కాగిజిరి టికెట్ ఆశిస్తున్న కాంగ్రెస్ నేత నందికంటి శ్రీధర్‌కూడా అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
కాంగ్రెస్ వ్యతిరేకుల చేతిలో పార్టీ బందీ : తిరుపతి
జీవితాంతం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పని చేసిన వ్యక్తులకు నాయకత్వం అప్పగించడంతో, వారి చేతిలో పార్టీ బందీ అయ్యిందని తిరుపతిరెడ్డి లేఖలో పేర్కొన్నారు.కొందరు నేతలు కేవలం నోట్ల కట్టలను నమ్ముకుని రాజకీయాలుచేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని నడిబజారులో వారు నవ్వులపాలు చేయడం ఖాయమని పేర్కొన్నారు. ఒక నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా ఇలాంటి పరిణామాలను జీర్ణించుకొలేక, చూస్తూ పార్టీలో ఉండలేక, బరువు ఎక్కిన గుండెతో పార్టీని వీడుతున్నానని తెలిపారు. కాంగ్రెస్‌లో ఇన్నాళ్లు తనకు అన్ని విధాలుగా సహకరించిన వారందరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.