– ఇద్దరు అధికారుల సస్పెన్షన్!
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ బాలానగర్ ప్లైఓవర్‌పై ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తులు దర్శనమిచ్చిన ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటిని రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలానికి చెందిన దరఖాస్తులుగా అధికారులు గుర్తించారు. దరఖాస్తుల ట్రాన్స్‌పోర్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ సీరియస్ అయ్యారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా హయత్‌నగర్ సూపరింటెండెంట్ (సర్కిల్-3) ఎస్.మహేందర్‌ను సస్పెండ్ చేశారు. కుత్బుల్లాపూర్ సూపరింటెండెంట్‌పైనా సస్పెండ్ వేటు వేసినట్టు తెలిసింది. ఈ మేరకు రోనాల్డ్ రోస్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు సంబంధించిన అప్లికేషన్స్ విషయంలో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరిచారు. ఏ ఒక్క అప్లికేషన్ వదలకుండా అప్‌లోడ్ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని, సోషల్ మీడియాలో వచ్చే వాటినిఎవరూ నమ్మొద్దని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.