– భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డే నేడు
– సిరీస్ విజయంపై రోహిత్‌సేన గురి
– మధ్యాహ్నం 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో..
చాంపియన్స్ ట్రోఫీకి ముందే టీమ్ ఇండియాకు తీయని తలనొప్పి మొదలైంది!. తొలి వన్డేకు దూరమైన విరాట్ కోహ్లి నేడు కటక్ సమరానికి సిద్ధమవటంతో తుది జట్టు కూర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బ్యాటింగ్ లైనప్‌లో కోహ్లి కోసం ఎవరిని తప్పిస్తారనే చర్చ క్రికెట్ వర్గాల్లో నడుస్తోంది. సిరీస్ విజయంపై కన్నేసిన భారత్ నేడు కటక్ వన్డేలో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది.
నవతెలంగాణ-కటక్
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సన్నాహక సిరీస్‌లో భారత్, ఇంగ్లాండ్‌లు కొన్ని ప్రయోగాలకు సిద్ధమవుతున్నాయి. మెగా ఈవెంట్ ముంగిట మరో రెండు మ్యాచులే మిగిలి ఉండగా.. తుది జట్టు కూర్పు సహా కొన్ని సవాళ్లకు పరిష్కారం అన్వేషించే భాగంలో కటక్‌లో సరికొత్తగా బరిలోకి దిగేందుకు ఎదురుచూస్తున్నాయి. కటక్‌లోనే సిరీస్ విజయాన్ని పూర్తి చేసి.. అహ్మదాబాద్‌లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని భారత్ భావిస్తుంది. సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఇంగ్లాండ్ కనిపిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ రెండో వన్డే నేడు.
ఆ ఒక్కరు ఎవరు?
స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రాకతో బ్యాటింగ్ లైనప్‌లో కూర్పు సమస్యగా మారింది. కోహ్లి స్థానంలో ఆడిన శ్రేయస్ అయ్యర్ నాగ్‌పూర్‌లో అదరగొట్టాడు. మ్యాచ్‌ను మలుపుతిప్పే ఇన్నింగ్స్‌తో మెరిశాడు. కోహ్లి వంటి ఆటగాడిని బెంచ్‌కు పరిమితం చేసే పరిస్థితి లేదు. శుభ్‌మన్ గిల్ సైతం తొలి మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను తప్పిస్తే.. గిల్‌ను రోహిత్‌కు తోడుగా పంపించే ఆలోచన లేకపోలేదు. అయ్యర్, జైస్వాల్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం కానున్నారు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ తుది జట్టులోకి రానున్నాడు. పేస్ విభాగంలో అర్షదీప్ సింగ్ అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. నాగ్‌పూర్‌లో రాణించిన హర్షిత్ రానాను తప్పించటం సైతం కెప్టెన్, కోచ్‌కు కాస్త సవాల్‌తో కూడుకున్నదే. స్పిన్నర్ల నుంచి జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టమైన మ్యాజిక్ షో ఆశిస్తోంది. కుల్దీప్ యాదవ్ కటక్‌లోనైనా తనదైన మార్క్ మాయ చూపించాలని తపిస్తున్నాడు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య మరోసారి జట్టుకు కీలకం కానున్నారు.
పిచ్, వాతావరణం
సుమారు ఐదేండ్ల తర్వాత కటక్ ఓ వన్డే మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. సహజంగా కటక్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. 2017లో ఇక్కడ జరిగిన వన్డేలో భారత్, ఇంగ్లాండ్‌లు 381, 366 స్కోర్లు చేశాయి. మ్యాచ్‌కు ఎటువంటి వర్షం సూచనలు లేవు. మంచు ప్రభావం నేపథ్యంలో టాస్ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకునే వీలుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కెఎల్ రాహుల్/రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా/అర్షదీప్ సింగ్, మహ్మద్ షమి.
ఇంగ్లాండ్ : బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీపర్), జో రూట్, హ్యారీ బ్రూక్, జోశ్ బట్లర్ (కెప్టెన్), లియాం లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, బ్రైడన్ కార్సె, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్‌వుడ్/సకిబ్ మహమూద్.