– ఆ వీధిలో నూతన సీసీ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలి
– ఎమ్మెల్యే, జిల్లా అధికారులు దృష్టి సారించాలి
నవతెలంగాణ – ఆళ్ళపల్లి : గత రెండు రోజులుగా మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దాంతో మండలంలో 40.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. శనివారం కురిసిన భారీ వర్షానికి మండలంలోని జల్లేరు, కోడెల వాగులు వేకువజామున ఉధృతంగా, కిన్నెరసాని వాగు మోస్తరుగా ప్రవహించాయి. ఈ నేపథ్యంలో కర్ణగూడెం గ్రామానికి చెందిన ఓ రైతు ట్రాక్టర్ ఇంజన్(కల్టివేటర్)తో వ్యవసాయ పనులు నిమిత్తం మర్కోడు గ్రామం వైపు వెళ్తున్న క్రమంలో జల్లేరు వాగు దాటుతుండగా ఇసుకలో దిగబడింది. దాంతో యజమాని, పలువురు గ్రామస్తులు కలిసి ట్రాక్టర్ ను బయటకు లాగడానికి పడరాని పాట్లు పడ్డారు. కర్ణగూడెం ప్రజల రాకపోకలు సజావుగా సాగేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కోట్ల నిధులు వెచ్చించి జల్లేరు వాగుపై బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించింది. కానీ, గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు జల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో నిర్మాణం దశలో ఉండగానే వంతెన మూడు పిల్లర్లు వంగిపోవడంతో అర్ధంతరంగా బ్రిడ్జి పనులు నిలిచిన విషయం తెలిసిందే. దాంతో ఆ బ్రిడ్జి పనులకు అదనపు నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి అనివార్యమైంది. దాంతో ఎన్నాళ్ళో! మా కర్ణగూడెం ప్రజల జల్లేరు వాగు దాటే అవస్థలని గ్రామస్తులు వాపోతున్నారు. ఇకనైనా నూతన కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం పనులు సాధ్యమైనంత త్వరగా పునః ప్రారంభించి మా గ్రామ రవాణా సమస్యను తీర్చాలని గ్రామస్తులు సంబంధిత అధికారులు, పాలకులను వేడుకుంటున్నారు.
కాగా, మండల కేంద్రంలోని ప్రధాన పురవీధ గత కొన్ని సంవత్సరాలుగా వర్షం పడిన ప్రతిసారీ వర్షపు నీరు నిలిచిపోయి, చిత్తడిగా మారుతోంది. వర్షాకాలం సీజన్ లో ఆ దారి పరిస్థితి వర్ణనాతీతం. సుమారు 20 సంవత్సరాల క్రితం వేసిన కాలం చెల్లిన ఆ పాత సీసీ రోడ్డుకు ఇరువైపులా గ్రావెల్ ఎత్తుగా పోసి ఉండటం, సీసీ రోడ్డులో పెద్ద పెద్ద గుంతలు ఉండటం, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం వెరసి వరద నీరు నిలిచిపోయి బురదమయం అవుతుంది. దాంతో ఈ వీధిగుండా వెళ్లే వాహనాలు, రైతులు, పశువుల రాకపోకలకు గుంతలమయమైన సీసీ రోడ్డు చిత్తడిగా మారి దుర్వాసన వెదజల్లుతుంది. ఏకకాలంలో వాహనాలు, పశువులు, పాదచారులు వెళ్తున్న సమయంలో ప్రజలకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రంలో గత వర్షాకాలం, శీతాకాలం సీజన్ లలో డెంగ్యూ, రక్త పరీక్షల్లో తేలని ఒంటి నొప్పులతో కూడిన విష జ్వరాల బారిన పడి స్థానిక ప్రజలు ఆరోగ్య పరంగా, ఆర్థికంగా నానా అవస్థలు చవిచూసిన నేపథ్యంలో ప్రస్తుత వర్షాకాలం సీజన్ లో కురిసే భారీ వర్షాలకు ఇంకా ఏ కొత్త రోగాలు, వ్యాధులు వస్తాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మండలంలో ఇప్పటికీ గత మూడు సంవత్సరాలుగా డెంగీ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్, ప్లేట్ లెట్ పడిపోవడం వల్ల సంభవించిన మరణాల భయం ప్రజల్లో ఇంకా పోలేదు. వర్షాకాలం వచ్చిందంటే విష జ్వరాలకు తోడు ఈ బురద మయమైన పురవీధులు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారాయని పలువురు స్థానికులు వాపోతున్నారు. ఆళ్ళపల్లిలో మోస్తరుగా కురిసిన వర్షానికే ప్రధాన వీధి పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, రానున్న రోజుల్లో కురిసే భారీ వర్షాలకు మండల కేంద్రములోని ప్రధాన పురవీధి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో చెప్పకనే చెబుతోంది. ఇకనైనా నియోజకవర్గం ఎమ్మెల్యే, సంబంధిత జిల్లా, స్థానిక అధికారులు ఆళ్ళపల్లి ప్రధాన పురవీధికి మురుగు నీరు నిలిచిపోయి దోమల, ఈగల వల్ల ప్రజలు విషజ్వరాలు, రోగాల బారిన పడక ముందే ఆళ్ళపల్లి బస్టాండ్ సెంటర్ లోని పార్టీ గద్దెల నుంచి యూనియన్ బ్యాంక్ వరకు నూతన సీసీ రోడ్డుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని స్థానికులు కోరుతున్నారు.