రైతుల ఆత్మహత్యలు పట్టని కాంగ్రెస్‌ ప్రభుత్వం

– మాజీ మంత్రి హరీష్‌ రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో నిత్యకృత్యమైన రైతుల ఆత్మహత్యలను కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో ఓ రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో సీఎం సొంత జిల్లాకు చెందిన మరో రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని గుర్తు చేశారు. ఈ రెండు ఘటనలు మరవక ముందే గురువారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలం కావడంతోనే నిరాశ చెందుతున్న అన్నదాతలు అత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.