నవతెలంగాణ – ఆదిలాబాద్ టౌన్
కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత బీసీలకు తీరని అన్యాయం చేస్తోందని, బీసీ రిజర్వేషన్లపై కమిషన్ ల పేరిట కాలయాపన చేస్తోందని మాజీ మంత్రి, బీ.ఆర్.ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. సోమవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చ్ లో బీసీ కమిషన్ ఏర్పాటుపై అసెంబ్లీ లో తీర్మానం చేస్తే సెప్టెంబర్ లో కమిషన్ ఏర్పాటు చేశారని అన్నారు. డెడికేషన్ కమిషన్ కాకుండా మాములు కమిషన్ వేసి చేతులు దులుపుకున్నారని హై కోర్ట్ అక్షింతలు వేస్తే తాజాగా నవంబర్ లో మరో డెడికేషన్ కమిషన్ వేశారని అన్నారు. రిజర్వేషన్లు తదితర అంశాలపై ట్రిబుల్ టెస్ట్ ప్రాతిపదికన అని గతంలోనే సుప్రీమ్ కోర్ట్ అనేక మార్లు తీర్పును ఇచ్చిన విషయాన్నీ గుర్తు చేశారు. తాజాగా బీహార్ సర్వే రిపోర్ట్ ను సైతం న్యాయస్థానం కొట్టివేసిందన్నారు. ప్రభుత్వ అసమర్ధత, నిర్లక్ష్యం కారణంగా బీసీలు రిజర్వేషన్లకు దూరమయ్యే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. డెడికేషన్ కమిషన్ ఏ శాఖతో సమన్వయం చేసుకోవాలన్న అంశంపై స్పష్టత లేదని, ఇప్పటివరకు సమీక్ష సమావేశాలు, పర్యటనలు జరపకపోవడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. ప్రస్తుతం జరుగుతున్న సర్వేకు, కమిషన్ కు ఎటువంటి సంబంధం లేదన్నారు. కమిషన్ సభ్యులు క్షేత్రస్థాయి పర్యటనలు చేసి సర్వే జరిపితేనే స్పష్టత వస్తుందన్నారు. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. కమిషన్ ల పేరిట కాలయాపన చేయకుండా బీసీలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నేరవేర్చలన్నారు. సమావేశంలో బిసి పట్టణ అధ్యక్షుడు దాసరి రమేష్, మాజీ ఎంపిపి జగదీశ్, కౌన్స్ లర్ అశోక్, భూమన్న,నాయకులు ఉన్నారు.