– బీఆర్‌ఎస్ పంథాలో వెళితే ఆ పార్టీకి పట్టిన గతే పడుతుంది : సీపీఐ జాతీయ కార్యిదర్శి నారాయణ
– మఖ్దూం భవన్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ ఆకాంక్షించారు. అలాగాక బీఆర్‌ఎస్ పంథాలో వెళితే ఆ పార్టీకి పట్టిన గతే రేవంత్ సర్కార్‌కు పడుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి కోసం రేవంత్ సర్కార్ అందరిని కలుపుకుని ముందుకు వెళ్ళాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం లో సీపీఐ, ప్రజా సంఘాలు ప్రముఖ పాత్ర పోషించాయని గుర్తు చేశారు. నాడు స్వ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీతో సహా అన్ని పార్టీలు ప్రాంతాల వారిగా విడిపోయి తలో మాట మాట్లాడితే సీపీఐ మాత్రం ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఒకే మాట, ఒకే బాటలో కొనసాగిందన్నారు. తెలంగాణ ప్రజలు కెేసీఆర్‌కు పట్టం కడితే, 17 మందితో ఏర్పాటు చేసిన ఆయన మంత్రివర్గంలో రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన 12 మందికి మంత్రి పదవులు కట్టబెట్టి ప్రజలను అవమానించారని విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల గళమెత్తడంతో పాటు వారితో మమేకం కావాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేసే విధంగా బలం పెంచుకోవాలని సూచించారు. పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణాలో కేసీఆర్ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరించారని విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాకుండా ఆత్మగౌరవంతో కూడిన పాలన అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, ఎన్.బాలమల్లేష్, ఇ.టి.నర్సింహ్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, ఎన్.జ్యోతి, పాలమాకుల జంగయ్య, .సాయిలుగౌడ్, ఉజ్జని రత్నాకర్‌రావు, పుస్తకాల నర్సింగ్ రావు, ఎస్.ఛాయాదేవి, కలకొండ కాంతయ్య, పల్లె నర్సింహ్మా, లక్ష్మీనారాయణ, బి.వెంకటేశం, కె.ధర్మేంద్ర, పుట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు.