కాంగ్రెస్‌ పార్టీవి కారు కూతలు.. కరెంటు కోతలు

– కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటు వేస్తే అభివృద్ధిని దూరం చేసుకున్నట్టే
– చౌట్‌పల్లి -మెట్ల చిట్టాపూర్‌ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేసిందే
– కోటి లింగేశ్వర స్వామి మీద ఒట్టేసి చెబుతున్నా.. బీజేపీ కేంద్రం నిధులని అబద్దాలు చెబుతోంది
– కమ్మర్‌పల్లి మండలంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం
నవతెలంగాణ- కమ్మర్ పల్లి: కాంగ్రెస్‌ పార్టీవి వట్టి మాటలు.. కరెంటు కోతలు అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. గురువారం కమ్మర్‌ పల్లి మండలంలోని చౌట్‌పల్లి, బషీరాబాద్‌లో రాజ్యసభ సభ్యులు కేఆర్‌ సురేశ్‌రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీకి కరెంటు కోతల చరిత్రనే తప్ప రైతు కడుపు నిండా కరెంటు ఇచ్చిన చరిత్ర లేదన్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్నప్పుడు సరిపడా కరెంటు ఇవ్వని కాంగ్రెస్‌ పార్టీ, ఇప్పుడు కర్ణాటకలో అధికారంలోకి వచ్చి ఐదు గంటల కరెంటును కూడా సరిగ్గా ఇవ్వలేకపోతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణలో కరెంటు పరిస్థితి ఏమవుతుంతో ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయానికి కరెంటు ఇచ్చి ప్రోత్సహించడం లేదన్నారు. మహారాష్ట్రలో వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్‌ కోసం లక్షా ఎనభై వేల రూపాయల డీడీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. అదే తెలంగాణలో అయితే ఆరు వేల రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నామన్నారు. వ్యవసాయానికి విద్యుత్తును వాడుకుంటే మహారాష్ట్రలో బిల్లు కట్టాలని, తెలంగాణలో  బిల్లు కట్టే అవసరమే లేకుండా కేసీఆర్‌ కరెంటు ఇస్తున్న సంగతి మరిచిపోవద్దన్నారు. పనిచేసేవారికి ఓటు వేపి ప్రోత్సహించాలన్నారు. ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలకు పనిచేయకపోతే ఓడగొడతారనే భయంతో పాటు పనిచేస్తే ఓటు వేసి గెలిపిస్తారని భరోసా కూడా ఉండాలన్నారు. మళ్లీ మూడోసారి అధికారంలోకి రాగానే కొత్త బీడీ పీఎఫ్‌  వచ్చిన వారికి బీడీ పింఛన్‌ ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. మిగిలిన వారందరికీ కొత్త రేషన్‌ కార్డులు ఇస్తామన్నారు. రుణమాఫీ పై ప్రతిపక్షాలు చేసే దుష్ర్పచారాన్ని నమ్మవద్దని కోరారు. ప్రతిరైతుకు రుణమాఫీ జరిగి తీరుతుందని, ఇందుకు తనది,ఎంపీ సురేశ్‌రెడ్డిది జిమ్మేదార్‌ అని హామీ ఇచ్చారు. చౌట్‌పల్లి, తన సొంత గ్రామం లాంటిదన్నారు. తన మేనత్తను ఇదే ఊరికి ఇచ్చామన్నారు. చౌట్‌పల్లిని రూ. 60.36 కోట్లతో అభివృద్ధిని అందించాన్నామన్నారు. సబ్‌స్టేషన్‌, గోదాం నిర్మించామన్నారు. చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు చేయించామన్నారు. బషీరాబాద్‌లో మాటు కాలువ గండ్లు పడుతున్న చోట సీసీ లైనింగ్‌ వేయిస్తానని హామీ ఇచ్చారు. గట్టు పొడిచిన వాగు ప్రాజెక్టు, హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల నీళ్లు బషీరాబాద్‌కు పరిపూర్ణంగా అందేలా చేసి రెండు పంటలు పండేలా చేసే బాధ్యత తనది అన్నారు. తనకంటే ముందు పనిచేసిన వారు, బీఆరెస్‌ కంటే ముందు ఉన్న పార్టీలు ఈ గ్రామాల్లో ఇలాంటి అభివృద్ధి ఎందుకు అందించలేదో ఆలోచించాలని కోరారు. అభివృద్ధి కళ్ల ముందే ఉందన్నారు. సబ్‌ స్టేషన్లు మంజూరి చేయించి రెండు గ్రామాల యాభై ఏండ్ల కల నెరవేర్చానన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంత్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదించి గెలిపించుకుందామన్నారు. ఎంతో అభివృద్ధిని అందించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డికి మన దగ్గరకు వచ్చి ఓటు అడిగే నైతిక హక్కు, సతా ఉన్నాయన్నారు. గ్రామంలోని కోటి లింగేశ్వరస్వామి, లక్ష్మీ నారాయణుడి ఆశీస్సులు ప్రశాంత్‌రెడ్డికి ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్‌ ఆ మూలన కామారెడ్డి నుంచి గెలిచి సీఎంగా ఉంటే .. ఆయన ప్రియ శిష్యుడు ఈ మూలన బాల్కొండ నుంచి మంత్రిగా ఉంటే జిల్లాకు ఎంతో మజ్‌బూత్‌ ఉంటుందన్నారు. అనేక పార్టీలు వస్తాయి పోతాయి,పనిచేసిన పార్టీని అభ్యర్థినే గెలిపించుకుందామన్నారు. తెలంగాణ ప్రజల కోసం త్యాగాలు చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరేనన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ను వేటాడేందుకు వచ్చిన వేటగాడినని మాట్లాడటం హాస్యాస్పదం అన్నారు. తెలంగాణకు సైనికుడిగా ఉన్న కేసీఆర్‌ను కొడితే ఒక్కరు కూడా ఊరుకోరని గుర్తించుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి వేటకు వచ్చిన తుపాకీ రామన్న అని ఎద్దేవా చేశారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లో మహిళలు, యువకులు బోనాలు, బైక్‌ ర్యాలీలతో ఘన స్వాగతం పలికారు. యాదవులు గొర్రెపిల్లను, గంగపుత్రులు చేపలను, చేపబుట్టలను మంత్రికి బహుమానంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.