రాజ్యాంగం స్పూర్తితో దేశాభ్యున్నతికి పాటుపడాలి

– అంబేడ్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నవతెలంగాణ-కంఠేశ్వర్
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రూపొందించిన భారత రాజ్యాంగం స్పూర్తితో దేశాభ్యున్నతికి పాటుపడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. అన్ని వర్గాల వారికి రాజ్యాంగబద్దంగా హక్కులు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్ అని కొనియాడారు.  అంబేడ్కర్ 133వ జయంతిని పురస్కరించుకుని ఫులాంగ్ చౌరస్తా వద్ద గల అంబేడ్కర్ విగ్రహానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.మకరందు, ట్రైనీ ఐ.ఏ.ఎస్ కిరణ్మయి, వివిధ శాఖల అధికారులు, ఆయా సంఘాల నాయకులు రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అన్ని మతాల వారు సమానంగా అభివృద్ధి చెందాలని బాబాసాహెబ్ అంబేడ్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా ఉద్బోధించారు. ఈ దిశగా రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమానత్వం, సౌబ్రాతృత్వం కల్పించారని గుర్తు చేశారు. రాజ్యాంగం ఆధారంగానే నేడు అందరికీ హక్కులు, ఫలాలు అందుతున్నాయన్నారు. పుర ప్రముఖులతో కలిసి అంబేడ్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ అధికారిణి శశికళ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్, దళిత, బీసీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.