– భావితరాల కోసం అడవులను కాపాడాలి : డీవైఎఫ్‌ఐ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వికారాబాద్ జిల్లా పూడూరు సమీపంలోని దామగుండం అటవీ ప్రాంతంలో రాడార్ స్టేషన్ నిర్మాణంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుమారు మూడు వేల ఎకరాల్లో రాడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో లక్షల సంఖ్యలో చెట్లు, వన్యప్రాణులకు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. అడవి ధ్వంసమై పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాడార్ స్టేషన్ ఏర్పాటుతో మూసీ నది మనుగడకు జీవ వైవిధ్యానికి, పర్యావరణానికి ప్రమాదమని పేర్కొన్నారు. భావి తరాల కోసం అడవిని కాపాడాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. పర్యావరణానికి నష్టం లేని ప్రాంతంలో నిర్మించాలని డిమాండ్ చేశారు.