– కోదండరామ్‌కు ఏఐవైఎఫ్ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్సీ గురుకులాల్లోని విద్యార్థులకు మానసిక ఉల్లాస తరగతులను ఆధ్యాత్మికం పేరుతో మత రాజకీయాలను బోధించే బ్రహ్మకుమారీస్ సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు టీజేఎస్ అధినేత, ఎమ్మెల్సీ కోదండరామ్‌ను సోమవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వలీఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి కె ధర్మేంద్ర, వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు టి సత్యప్రసాద్ కలిసి వినతిపత్రం సమర్పించారు. శాస్త్రీయ దృక్పథాన్ని దెబ్బతీసే గురుకుల కార్యదర్శి అలుగు వర్షిణి నిర్ణయాలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని విద్యార్థుల్లోకి తీసుకెళ్లడం కోసమే బ్రహ్మకుమారీస్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే విధానాలను అవలంభించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఉందని గుర్తు చేశారు. కానీ గురుకులాల్లోని విద్యార్థులకు మతబోధనను చెప్పించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కోదండరామ్ మాట్లాడి ఆ ఒప్పందాన్ని రద్దు చేయించేలా చొరవ చూపాలని కోరారు. ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.