కమీషన్ లు కోసమే కాంట్రాక్టర్ ను మార్చారు

The contractor was changed only for commissions– డ్రైనేజీ నిర్మాణంలో నాణ్యతను తిలోదకాలు ఇచ్చారు..
– మండల పరిషత్ పూర్వ అద్యక్షులు శ్రీరామమూర్తి
నవతెలంగాణ – అశ్వారావుపేట
కమీషన్ లు కోసమే కాంట్రాక్టర్ ను మార్చి నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో నిర్మిస్తున్న సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీ నిర్మాణం పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారని అశ్వారావుపేట మండల పరిషత్ పూర్వ అద్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి ఆరోపించారు. బుధవారం నవతెలంగాణ లో ప్రచురితం అయిన నాసిరకంగా సెంట్రల్ లైటింగ్ పనులు శీర్షికన కథనానికి స్పందించి టీఆర్ఎస్ నాయకులు శిధిలం అయిన డ్రైనేజీ పునరుద్దరణ పనులను సందర్శించిన అనంతరం విలేఖర్లతో మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చొరవతో అశ్వారావుపేట కు సెంట్రల్ లైటింగ్ నిమిత్తం రూ.23 కోట్ల లను మంజూరు చేశారని, ఈ పనులను మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర రావు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం మారాక కొందరి నాయకుల స్వలాభం కోసం గత ప్రభుత్వం లో వేసిన టెండర్లను మార్చేసి,కమిషన్ల కోసం కాంట్రాక్టర్ ను మార్చేసి పనులను నాణ్యత లేకుండా నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.డ్రైనేజీ పోసిన వరం రోజులకే సుమారు 20 మీటర్ల మేర డ్రైనేజీ గోడ కూలిపోవడం దాని నాణ్యత పై అనుమానాలు ఉన్నాయని అన్నారు.మంగళవారం కూలిన డ్రైనేజీ గోడ శకలాలను కనపడకుండా  తొలగించడం వారి తప్పిదాన్ని దాచిపుచ్చుకోవడానికే నని విమర్శించారు.డ్రైనేజీలో ఎక్కడ కూడ కనీసం ఒక్క ఐరన్ రాడ్డు ఉపయోగించలేదు,అలాగే నాసిరకం ఇసుక,నాసిరకం సిమెంట్ వాడడం వల్లనే ఇలా జరిగిందని, ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్రను వీడి పనులలో నాణ్యత లోపాలను సరిచేసి పనులు పూర్తి చేయాలని వారు డిమాండ్ చేసారు. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో జరగాల్సిన పనులు గ్యాంగ్ మెన్ లు,కాంట్రాక్టర్ సూపర్వైజర్ లు పర్యవేక్షించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు యుఎస్ ప్రకాష్ రావు,పార్టీ అశ్వారావుపేట టౌన్  ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ,పేరాయిగూడెం ప్రెసిడెంట్ చిప్పనపల్లి బజారయ్య తదితరులు పాల్గొన్నారు.