మూలస్తంభాలు-వాస్తవాలు

మూలస్తంభాలు-వాస్తవాలుపేదలు, రైతులు, మహిళలు, యువత – ఈ నాలుగు మూలస్తంభాలపైనే మన భారతదేశం విరాజిల్లుతుందని కేంద్రంలోని మోడీ ప్రభుత్వ మాటలుగా రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పార్లమెంటు వేదికగా ఉటంకించారు. తద్వారా సర్వతో ముఖాభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నట్టు ఆమె చెప్పుకొచ్చారు. పార్లమెంటు నూతనభవనంలో ఉభయ సభలనుద్దేశించి 75 నిముషాల పాటు సాగిన రాష్ట్రపతి ప్రసం గానికి పాలకపక్షం పలుమార్లు పదే పదే హర్షద్వానాలు ప్రకటించడంలో వింతేమీ ఉండదు. అయోధ్య రామాల యంలో బాలరామ విగ్రహ ప్రాణప్రతిష్టాపన గురించి ప్రస్తావించినప్పుడయితే బల్లలు చరిచి మరీ కేరింతలు కొట్టడం బహిరంగసభను తలపించింది. అయితే భవి ష్యత్‌ కార్యాచరణ ప్రణాళిక గురించి కాకుండా కేవలం గత పదేళ్ల కృషికే రాష్ట్రపతి పరిమితి కావడం గమనర్హం.
న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలు మూలస్తంభాలుగా మనం భారత రాజ్యాంగాన్ని బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ సారథ్యంలో రూపొందించుకు న్నాము. మన దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకున్నాము. 75 ఏండ్ల అమృతోత్సవ వేడుకల వేళ, ఈ మూలస్తంభాల ప్రస్తావన ఎలా మారుతున్నదీ (అదీ పార్లమెంటు వేదికగా) మనం గమనించవచ్చు. కాగా, ఈ తొమ్మిదేండ్ల వ్యవధిలో పాతిక కోట్లమంది పేదలు (మొదటి స్తంభం) దారిద్య్రరేఖ ఊబి నుండి బయటపడినట్టు నిటిఅయోగ్‌ చర్చా పత్రం చెబు తున్నది. 2013-14లో 29.7 శాతంగా నమోదైన పేదరికం 2022-23 నాటికి 11.28 శాతానికి తగ్గినట్టు అది పేర్కొంది. 2030 నాటికల్లా ఆకలి బాధకు తాళలేని, తావులేని సుందర ప్రపంచాన్ని సృష్టించాలనే ఐ.రా.స సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగానే భారత్‌ వడివడిగా అడుగులో వేస్తున్నట్టు వివరించింది.
మరైతే దేశవ్యాప్త్తంగా 81 కోట్లమంది అన్నార్తులకు మరో ఐదేళ్ల పాటు ఉచితంగా తిండిగింజల పంపిణీని మోడీ ప్రభుత్వం ఎందుకు ప్రకటించినట్టు? అని ఆర్థిక నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బహుముఖ పేదరిక సూచిలో మన భారతదేశం పొరుగునున్న బంగ్లాదేశ్‌, శ్రీలంక కన్నా దిగువనే ఉంటున్నదని వారు ఆందోళన పడుతున్నారు. దేశంలో దాదాపు 23కోట్ల మంది కటిక పేదరికంలో జీవిస్తున్నారని, వారిలో 15కోట్ల మందికి పైగా ప్రజానీకానికి నూరు రోజులపని (ఉపాధి హామీ పథకం) మాత్రమే దిక్కు అని తెలిపారు. వ్యవసాయ కూలీలు, రోడ్డు మీద రోజువారీ అడ్డా కూలీలు. పేవ్‌మెంట్‌ వెండర్స్‌ (చిన్న చిన్న విక్రయ దారులు) పని మనుషులు, ఒంటరి మహిళలు, నిరాధార వృద్ధు లు, పండ్లు, కూరగాయలు అమ్ముకునే వాళ్లు, చేతి వృత్తుల వాళ్లు, సఫాయి కార్మికులు, గనులు, సున్నపు రాయి, కంకర, గ్రానేడ్‌ వంటి ప్రమాదకర రాళ్లపనివాళ్లు, నిర్మాణ కార్మికులు, మృతకళేబరాల చర్మాలను శుభ్రపరిచేవారు, చెత్తా చెదారం (గార్బెజ్‌) ఏరుకునేవారు, సముద్రం- నదులు జలాల మధ్య పనిచేసుకునే మత్సకారులు, అటవీ ఉత్ప త్తులు సేకరిచుకునే గిరిజనులు – ఇలా ఎంతో మంది పేదలు నిత్య జీవితంలో మనకు తారసపడుతూనే ఉంటారు. విషయం ఏమంటే మనదేశంలో సంపన్నులు ఏడు శాతం మంది మాత్రమే ఉంటే మిగిలిన 93 శాతం మంది మధ్యతరగతి, పేదవారు అన్న వాస్తవాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని ఇటీవల మాజీ ఆర్థికశాఖ మంత్రి చిదంబరం కూడా వక్కాణించారు.
ఇక రైతులు (రెండవస్తంభం) విషయానికొస్తే మనం ఒకటి కచ్చితంగా చెప్పు కోవాలి. ఈసారి గణతంత్ర వేడుకలకు ప్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ అతిథిóగా హాజరయ్యారు. ప్రపంచ వ్యూహాత్మక రాజకీయాల్లో అనుసరించే ఆయుధ సైనిక పాటవాల్లో భాగంగా ఈ పర్యటనను భావించాలని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌ – ప్రాన్స్‌ ఉభయ దేశాల మధ్య జరుగుతున్న ఒప్పందాలు ఆత్మనిర్భర్‌ భారత్‌కే కాకుండా మేక్‌ ఇన్‌ ఇండియాకు కూడా ఉపకరిస్తుందని గోదీ మీడియా ప్రగల్భాలు పలుకుతున్నది. ఎందుకంటే రాఫెల్‌ యుద్ధ విమా నాల తయారీ, ఇంజన్‌లు విడిభాగాల నిర్వహణ – మరమ్మతు వంటి అంశాలు కూడా ఇందులో కీలకం మరి.అయితే మనదేశంలో మాదిరి ప్రాన్స్‌ రైతులు కూడా తమ ప్రభుత్వంపౖౖె కత్తులు దూస్తున్నారు. ఇదో సారూ ప్యత, ఎంత దాచిపెట్టినా ఈ వార్తలు బయటకు పొక్కుతూనే ఉన్నాయి. ఇటీవల ఇద్దరు మహిళా ఉద్యమకారులు తమ నిరసనగా పారిస్‌ మ్యూజియంలోని మోనాలిసా పెయింటింగ్‌పై సూప్‌ విరజిమ్మారు. సుస్థిరమైన ప్రజా రోగ్యానికి కావాల్సింది ఆహారభద్రతా? కళాఖండాలా? ఏది ముఖ్యం? అని ప్రశ్నించారు. ‘మనదేశ (ఫ్రాన్స్‌) వ్యవసాయరంగ పెను సంక్షో భంలో చిక్కుకున్నది. రైతులు చనిపోతూ ఉన్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలి’ అని వారు ఆ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ఇంధన ధరలు మోయలేని విధంగా పెరిగాయంటూ రైతులు ట్రాక్టర్‌లతో పారిస్‌ నగరాన్ని దిగ్భంధించారు. ఇది సాక్షాత్తు ఢిల్లీలో ఏడాదిన్నర పాటు సాగిన మన కిసాన్‌ ఉద్యమాన్ని గుర్తుకుతెస్తున్నది. 700 మందికి పైగా రైతులు ఆ ఉద్యమంలో బలైపోయిన విషయం తెలిసిందే. నల్లచట్టాల రద్దు విషయంలో అప్పుడు ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చనపుడు ఇక మోడీ ప్రభుత్వాన్ని నమ్మేదెలా..? భారత రైతుల ఆక్రోశం ఇది.
మరి మహిళలు (మూడవస్తంభం) విషయానికి వస్తే బిల్కిస్‌బానో ఉదంతం ఒక్కటిచాలు.2002 గుజరాత్‌ నరమేధం ఘటనలో బిల్కిస్‌బానో అనే గర్భవతిపై అరాచక ఉన్మాదమూకలు దాడి చేసాయి. మూడేళ్ల కుమార్తెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు మొత్తం ఏడుగురిని ఆ మూకలు అమానుషంగా హత్య చేసాయి. అక్కడితో ఆగక ఆమెపై పైశాచికంగా సామూహిక అత్యాచారం చేసారు. చెప్పనలవికాని ఈ దుర్మార్గంపై బిల్కిస్‌బానో ఒంటరిగా సుదీర్ఘ కాలం పాటు న్యాయ పోరాటం చేసింది. ఎట్టకేలకు ముంబై హైకోర్టు ఈ కేసులో 11 మందిని దోషులుగా నిర్దారించి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2008 జనవరిలో ఈ తీర్పు వచ్చింది. కానీ ప్రధాని మోడీ 2022 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఎర్రకోటపై నుండి భారత నారీశక్తికి దేశమంతా గర్వించాలని ఉద్ఘాటించిన కొద్ది సేపటికే గుజరాత్‌ ప్రభుత్వం, మిగతా శిక్షకాలం రద్దు చేసి ఆ నేరస్తులను రెమిషన్‌పై విడుదల చేసింది. విడు దలైన వారిలో ఏ ఒక్కరూ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు సరికదా, వారిలో కొం దరిని వారి అనుచరులు మేళ తాళాలతో ఊరేగించారు. మరికొందరైతే వారి ‘ఘనకార్యానికి’ హారతులిచ్చి సాష్టాంగ ప్రాణమిల్లారు. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం గతనెల 8వ తేదీన విస్పష్టమైన తీర్పు ఇస్తూ…ఆ పదకొండు మంది నేరస్తులు వెంటనే లొంగిపోయి జైలుకు వెళ్లాలని ఆదే శించింది. ప్రస్తుతం కొందరు పరారీలో ఉన్పట్టు తెలుస్తున్నది. ‘నేను మళ్లీ ఊపిరి పీల్చుకుంటున్నాను’ అని ఈ సందర్భంగా బిల్కిస్‌ బానో పలికిన మాటలు నారీ, ధర్మ పక్షపాతుల గుండెల్లో నిత్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
చివరగా (నాల్గవస్తంభం) యువత. ప్రపంచంలో అతిపెద్ద జనాభా కలిగిన (141 కోట్లు) భారతదేశంలో ముప్పైఏండ్లలోపు ఉన్న యువ-బాలలు 60 శాతం మంది. అందులో సగం 16-30 ఏండ్లు కలిగిగన యువత ఉన్నారనుకుంటే, వారిసంఖ్య 42 కోట్లు. అందుకే మన దేశాన్ని యంగ్‌ ఇండియా (యువభారత్‌)గా పిలుస్తున్నారు. నిజమే – కానీ యువతను దేశ నిర్మాణ పథంవైపు నడిపించే ప్రణాళికలేవీ పాలకుల వద్ద లేవు. నేడు కార్పోరేట్‌ ప్రపంచీకరణ పడగనీడన ఎల్లెడలా ఉపాధి రహిత అభివృద్ధే వ్యాపిస్తున్నది. అది పర్యావరణాన్ని, సహజ వనరులను, మానవ వనరులను విధ్వంసం చేసే దిశగానే సాగుతున్నది.
ఈ నేపథ్యంలో యువతను నిర్వీర్యం గావించేందుకే పెద్ద ఎత్తున కుట్రలు సాగుతున్నయనడం సత్యదూరం కాదు. యంగ్‌ ఇండియాను డ్రగ్‌ ఇండియాలా మార్చేలా గ్రామా లకు సైతం మత్తు-మాదకద్రవ్యాలు విచ్చల విడిగా ప్రవహిస్తున్నాయి. మరో పక్క సెల్‌ఫోన్స్‌లో ఆవరించిన బూతు చిత్రాలు యువతను విషతుల్యం చేస్తున్నాయి. తాగడం, తిరగడం, అత్యాచారాలు చేయడం, హింసా ఉన్మాదచర్యలకు యువత పాల్పడటం అతి సామాన్యమైపోయింది. నిరుద్యోగం సరేసరి. మనదేశ నిరుద్యోగ రేటు 2023 జూలై నాటికి 7.95 శాతానికి చేరుకున్నది. నిరుద్యోగ యువమేధ అనివార్యంగా వెరిత్రలలు వేస్తుందని మానసిక నిపుణుల అభిప్రాయం.
ఇవన్నీ కళ్లముందు జరుగుతున్న కఠోర వాస్తవాలు. ముంజేతి కంకణానికి అద్దమేల? అన్నట్టు ప్రత్యేకించి చూప క్కర్లేదు. ప్రతి ఒక్కరికీ స్వానుభవమే. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టు పాలకులు భావిస్తే ఏం చేప్పలేం. మరి ఏ శాస్త్రీయ చర్యలతో ఈ మూలస్తంబాలను ఉద్దరిస్తారో పాలకులే చెప్పాలి. లేని పక్షంలో ఈ సంక్షోబాలు, ముదిరి ముదిరి అంత ర్యుద్ధాలకు దారితీసే ప్రమాద పరిస్థితులు అతిదగ్గర్లోనే ఉన్నాయనేది చరిత్ర చెప్పే పాఠం.
సెల్‌ : 9959745723
కె. శాంతారావు