
– సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ – వేములవాడ
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అరాచక నియంత కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని రాష్ట్ర ప్రజలకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం వేములవాడ పట్టణంలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తో కలిసి ఆయన మాట్లాడారు. బీఆరెస్ చేసిన 10 ఏళ్ల విధ్వంసానికి బీజేపీ వెన్నుదన్నుగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో పాలన కొనసాగిస్తున్నది బీఆరెస్ ఒక్కటే కాదని, బీఆరెస్, బీజీపీ కలిసి బీ ఆర్ ఎస్ ఎస్ గా మారి పాలన కొనసాగిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రానికి ఇన్ని సార్లు వచ్చిన మోడీ మేడిగడ్డ పేరు ప్రస్తావించలేదన్నారు. లిక్కర్ స్కామ్ ఏమైందో అందరికి తెలుసు కదా.. లిక్కర్- నిక్కర్ పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. మూడవ సారి బీఆరెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు అవినీతి, అబద్దాలు, అసమర్థుల అహంకార పూరిత పాలన కొనసాగుతుందని ఆరోపించారు. కేజీ టూ పీజీ ఒక అబద్దమన్నారు. రైతు బంధు డబ్బులు రైతులు కాని వారికి పంచి పెట్టాడని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రజలను, మంత్రులను, బ్యూరోక్రాట్లను, ఇంజనీర్లు ఎవరిని కలువడని.. ఒకవేళ కలిసినా ..ఎవరి మాట వినడన్నారు. ఇలా ఎవరి మాట వినకుండా లక్ష కోట్ల రూపాయలు ఆగం చేశాడనడానికి మంచి ఉదహారణ కాళేశ్వరం అని తెలిపారు. మూడవ సారి బీఆరెస్ అధికారంలోకి వస్తే 35 లక్షల మంది నిరుద్యోగులు, 45 లక్షల మంది చిన్నకారురైతులు, 22 లక్షల మంది కౌలు రైతులు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల మీద ఆశలుపెట్టుకున్న 28 లక్షల మంది ,అలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే 60 లక్షల మంది పిల్లల తల్లిదండ్రులు గోస పడుతరన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దొరల పాలనకు వ్యతిరేకంగా వేములవాడ ప్రజలు చారిత్రాత్మక తీర్పునివ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, పులి రాంబాబు గౌడ్, ముంజ మునేందర్ ,పుల్కం రాజు, కనికరపు రాకేష్, కృష్ణ ప్రసాద్ గౌడ్ సిపిఐ నాయకులు కడారి రాములు తో పాటు తదితరులు పాల్గొన్నారు.