మోడీ దత్తపుత్రుల అవినీతిని బయటపెట్టాలి

– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ప్రధాని నరేంద్ర మోడీ దత్తపుత్రుల అవినీతిని బయటపెట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె నారాయణ డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ కూతురుతో సహా తమిళనాడు నుంచి జమ్ము కాశ్మీర్‌ వరకు ప్రాంతీయ పార్టీలు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ కుటుంబ పాలన సాగుతున్నదని, వాళ్లంతా అవినీతికి పాల్పడుతున్నారంటూ మోడీ ఆరోపణలు చేయడంపై నారాయణ బుధవారం స్పందించారు. దేశం కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరడాన్ని ఆయన ఖండించారు. 30 మంది మోడీ దత్తపుత్రులు బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎంత అవినీతికి పాల్పడ్డారో లెక్కలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అందులో మోడీ ప్రథమ పుత్రుడు అదానీ ఉన్నారని వివరించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.లక్షల కోట్లు ఎగ్గొట్టి దేశం నుంచి వెళ్లిపోయారని విమర్శించారు. ఇక్కడే ఉండే పెద్ద దత్తపుత్రుడు దేశాన్ని దోచుకుంటుటే, వారికి సహకరిస్తున్నారని తెలిపారు. నేరపూరిత సామ్రాజ్యానికి బాధ్యత వహించే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని మోడీ ప్రతిపక్ష పార్టీల గురించి మాట్లాడ్డం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దత్తపుత్రులు ఎంత తిన్నారు, మిగిలిన వాళ్లు ఎంత తిన్నారనే లెక్కలు తీస్తే తమకేమి అభ్యంతరం లేదని వివరించారు.