బాల్యంలో భారీకాయం త‌ప్ప‌దు మూల్యం

చిన్న పిల్లలు ఎంత బొద్దుగా ఉంటే అంత ముద్దుగా ఉంటారు. పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తెలియని విషయంచిన్న పిల్లలు ఎంత బొద్దుగా ఉంటే అంత ముద్దుగా ఉంటారు. పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. తెలియని విషయం ఏమిటంటే, బొద్దుగా ఉండటం వేరు, భారీ ఖాయం వేరు. పిల్లలు ఎంత ఆహారం తీసుకున్నా చూడటానికి బాగా యాక్టీవ్‌గా, ఆరోగ్యంగా, ఆహ్లాదకరంగా ఉంటే వారు కేవలం బొద్దుగా తయారయ్యారు అని అర్థం.
ఆలా కాకుండా నీరసంగా, ఎక్కువసేపు నిల్చోలేకపోవడం, మాట్లాడేటప్పుడు ఆయాసం రావడం, శరీరంలోని భాగాలకు ముఖ్యంగా పొట్ట చుట్టుపక్కల కొవ్వు పట్టి చూడటానికి అంద వికారంగా ఉండటం, కాళ్లు, చేతుల చర్మం చారలుగా ఏర్పడి మొద్దుబారి పోవడం లాంటి లక్షణాలుంటే భారీకాయంగా పరిగణించవచ్చు. వయసు, ఎత్తు పరిగణలోకి తీసుకుని ఇంత బరువు వుండాలని ఒక పట్టిక వైద్య బందం తయారు చేసింది. ఆ పరిమితిని దాటివుంటే ఓవర్‌వెయిట్‌ అంటారు.
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. పాత రోజుల్లో కేవలం ఇంట్లో వండిన ఆహార పదార్థాలను మాత్రమే ఆరగించేవారు. కానీ ప్రస్తుత పరిస్థితి పూర్తి విరుద్ధం. బిజీలైఫ్‌లో నిద్రాహారాలకు మనిషి అవసరమైన సమయం కేటాయించడంలేదు. ఇంగ్లీషులో జంక్‌ అంటే చెత్త లేదా పనికిరాని కుప్ప అని అర్థం. వండుకోవడానికి బద్దకించినవాళ్లకు జంక్‌ఫుడ్‌ నిత్యావసరంగా మారిందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. జంక్‌ఫుడ్‌లో శరీరానికి కావలసిన పోషకాలు వుండవు. కానీ కార్బోహైడ్రేట్లు, కొవ్వు వంటి హానికరమైన పదార్థాలతో చేసి వుంటాయి. అందుకే జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినేవారు త్వరగా అలసటకు గురవుతుంటారు.
రోడ్లమీద, మురిక్కాల్వల పక్కన, బాగా మరగకాచిన నూనెతో వండిన పదార్థాలను తిని రోగాల బారిన పడుతున్నారు. స్నాక్స్‌ పేరుతో నూడిల్స్‌, పానీపూరి, బేకరీ ఐటమ్స్‌ వంటివి తినేప్పుడు నోటికి ఎంతో రుచికరంగా వున్నప్పటికీ.. ఒబెసిటీ, దీర్ఘకాలిక వ్యాధులొస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా ఈ తరహా ఫుడ్స్‌ తీసుకోవడమే పిల్లల్లో రోగ నిరోధక శక్తి తగ్గడానికి, అధిక బరువు పెరగడానికి, పెద్దవాళ్లల్లో పొట్ట సైజు పెరగడానికి ప్రధాన కారణం.
కాబట్టి బాల్యంలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది. మనం తీసుకునే ఆహారంలో తక్కువ పోషక పదార్థాలు, ఎక్కువ క్యాలరీలు వున్నప్పుడు, శారీరక శ్రమ లేనప్పుడు శరీరంలోకి అదనంగా చేరిన క్యాలరీలు కొవ్వులుగా మారి పొట్ట దగ్గర పేరుకుంటాయి. క్రమంగా శరీరమంతా వ్యాప్తి చెంది భారీకాయంగా మారుతుంది. చిన్నారుల్లో కనిపిస్తున్న ఇబ్బంది ఇదే.
జంక్‌ఫుడ్‌ ఎక్కువగా తినేవారిలో మెదడులోని రసాయనాలు మార్పు చెందుతాయి. దాంతో డిప్రెషన్‌, ఆత్రుత వంటి లక్షణాలకు దారితీస్తుంది. ఇవి శరీరానికి హాని చేసి, కడుపులో అల్సర్లు కలుగచేస్తాయి. జంక్‌ఫుడ్‌ తినే పిల్లల్లో చిన్నప్పుడు వారికిచ్చిన వాక్సిన్‌ పవర్‌ తగ్గి వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. యుక్తవయసు వచ్చేసరికి కాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
ప్రస్తుతం భారీకాయులుగా వున్న పిల్లలు యవ్వనంలోకి అడుగుపెడుతూనే డయాబెటిస్‌కి గురయ్యే ప్రమాదం వుంది. భారీకాయం వల్ల బాల్యదశలో కనిపించే ఇబ్బందులు కొన్నయితే, దీర్ఘకాలంలో తలెత్తే ఇబ్బందులు మరికొన్ని. భారీకాయం వచ్చిందంటే, కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొనే దుస్థితి వస్తుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం వుంది. ఈ దశలో రక్తంలో చక్కెరల స్థాయి అధికంగా వుండి డయాబెటిక్‌కి గురయ్యే అవకాశం ఏర్పడుతుంది. కీళ్ళ ఇబ్బందులు, సరిగా నిద్రలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
భారీకాయంలో వున్నవారు పెద్దయిన తర్వాత సన్నబడే అవకాశం బాగా తక్కువ. యవ్వనంలోకి ప్రవేశించిన తర్వాత కూడా అలాగే వుంటే గుండె జబ్బు, డయాబెటిస్‌, పక్షవాతం, ఎముకల బలహీనత లాంటివి వస్తాయి.
భారీకాయం వలన స్త్రీలలో సంతానలేమి సంభవిస్తుంది. రొమ్ము కాన్సర్‌, గర్భాశయ సమస్యలు తలెత్తుతాయి. థైరాయిడ్‌ గ్రంథిలో మార్పులు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌, జీర్ణనాళ క్యాన్సర్‌, అండాశయ సమస్యలు వస్తాయి. డిప్రెషన్‌కు గురై అధికంగా తింటారు. ఇలా ఒకదాని ప్రభావం మరొకదానిపై ఉంటుంది. భారీకాయం వంశపారం పర్య లక్షణాలు కూడా. ఈ సమస్యలున్నవారు వైద్యుల్ని సంప్రదిస్తే… కుటుంబ చరిత్ర, ఆహారపు అలవాట్ల వంటివి పరీక్షించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలుగుతారు.
2008లో అమెరికాలో ఆహారపదార్థాలపై కేలరీ లేబుల్స్‌ వేసిన తర్వాత కేలరీలు అధికంగా వున్న జంక్‌ ఫుడ్‌కు గిరాకీ తగ్గింది. దీని ప్రభావం అతి కొద్దిపాటిదే అయినప్పటికీ బాగుందని న్యూయార్క్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ రీసెర్చర్లు తెలుపుతున్నారు. అమెరికాలో ఊబకాయాలు పెద్దవారిలో, పిల్లల్లోను ఎన్నడూ లేనంతగా వుంటున్నాయి. ప్రస్తుత గణాంకాల మేరకు పెద్దవారిలో ప్రతి మూడోవారు, పిల్లలు, టీనేజర్లలో 17 శాతం వరకు లావుగానే వుంటున్నారు. ఫాస్ట్‌ ఫుడ్స్‌కు- అధిక కేలరీలు తీసుకోవడంలో వున్న సంబంధాన్ని అనేక అధ్యయనాలు రుజువు చేసాయి.
ఏది ఏమైనా ఆహారపు అలవాట్ల మీద ప్రత్యేక దష్టి పెట్టాల్సి వుంటుంది. ఆరోగ్యానిచ్చే పోషక పదార్థాలకు ప్రాధాన్యత పెంచి, క్యాలరీలు అధికంగా ఇచ్చేవాటిని తినడం తగ్గించుకోవాలి. అతిగా తినటంవల్ల శరీరం దెబ్బతింటుంది. జీర్ణక్రియ సామర్థ్యం తగ్గుతుంది. తిన్నది సరిగా ఒంటపట్టదు. ఫలితంగా క్యాలరీలు పేరుకుంటాయి. క్రమంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. అది మొదలైతే తగ్గడం చాలా కష్టం.
మత్తునిచ్చే మాదకద్రవ్యాలు, సిగరెట్లు, పాన్‌పరాగ్‌లు ఆరోగ్యాన్ని కుళ్లబొడిచినట్టే జంక్‌ఫుడ్‌ కూడా హెల్త్‌ని దెబ్బతీస్తుంది. షుగర్‌, గుండె, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులకు అది కారణమవుతుంది. ఫాస్ట్‌ ఫుడ్‌ కారణంగా తలెత్తే ఆరోగ్య రుగ్మతలకు చికిత్స చేయించుకోడానికి భారతదేశ జాతీయాదాయంలో ఏటా దాదాపు రెండువేల కోట్లకుపైగా నష్టపోతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది.
సాధారణంగా ఎవరైనా ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సింది మంచి ఆహారం, మంచి నిద్ర. ఈ రెండూ సరిగా లేకుంటే చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. కనీసం రాత్రి భోజన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.
రాత్రి పూట ఫ్రై చేసిన ఆహారాన్ని తీసుకోకూడదు. చీజ్‌ బర్గర్లు, పుల్లటి పండ్లు అస్సలు తినకూడదు. అలాగే టీ, కాఫీలు తాగవద్దని, వీటిని తీసుకుంటే నిద్రలేమి, జీర్ణ సమస్యలు, అధిక బరువు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో భారీకాయులు ఎక్కువవుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. గణాంకాల ప్రకారం ప్రస్తుతం కోటీ నలభై లక్షలమందికి బాల్యంలోనే భారీకాయం వుందని అంచనా. ఈ చిన్నారులు కొద్ది సంవత్సరాల్లో యువతగా రూపాంతరం చెందుతారు. అపుడు ఎక్కువమంది యువకులు భారీకాయులై ఉంటారనడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే భారతదేశంలో షుగర్‌ వ్యాధితో బాధపడేవారి సంఖ్య రోజురోజుకీ ఎక్కువవుతోంది.
మనం తాగే శీతల పానీయాలలో కెఫిన్‌, పాస్ఫరిటిక్‌ ఆసిడ్‌ మొదలైన రసాయనాలు అధిక మోతాదులో వుంటాయి. మంచినీళ్ల ప్రాయంగా శీతల పానీయాలు తీసుకుంటే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఎక్కువ నిల్వవున్న పచ్చళ్లు తీసుకుంటే ఇటు చిన్నపిల్లలకు, గర్భిణీలకు చాలా ప్రమాదం. భారతీయుల్లో 90 శాతం మందికి జంక్‌ ఫుడ్‌ వల్ల కలిగే అనర్థాల గురించి తెలుసు… కానీ.. అవి తినడానికే ఎక్కువగా ఇష్టపడతారు.
భారీకాయపు బాల్యం మానసిక సమస్యల్ని తెస్తుంది. చిన్నతనంలో భారీగా కనిపించేవారిని వింతగా చూస్తూ రకరకాల మాటలతో అవహేళన చేస్తుంటారు. స్కూలు స్థాయిలో స్నేహం చేసేందుకు ముందుకు రారు. చురుగ్గా ఉండలేదన్న కారణంగా ఆటల్లో కలుపుకోరు. దీనివలన ఒంటరిననే భావం ఏర్పడుతుంది. తమ రూపం మీద తమకే అసహ్యం వేస్తుంటుంది. మానసిక ఆందోళన పెంచుకుంటారు. ఆలోచనలు శరీరంమీద వున్నందున చదువులో వెనకబడతారు. ఇటువంటి వారిని తోటివారు ఏడిపిస్తుంటారు.
డిప్రెషన్‌కు గురై అధికంగా తిండి తింటారు. ఇలా ఒకదాని ప్రభావం మరొకదానిపై ఉంటుంది. భారీకాయం వంశపారంపర్య లక్షణాలు కూడా. కుటుంబ చరిత్ర, డాక్టర్లని సంప్రదిస్తే… ఆహారపు అలవాట్ల వంటివి పరీక్షించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో సలహాలు, సూచనలు ఇస్తారు.
ఏదైనా అతిగా తినటంవల్ల శరీరం దెబ్బతింటుంది. జీర్ణక్రియ సామర్థ్యం తగ్గటమే కాకుండా, తిన్నది కూడా సరిగా ఒంటపట్టదు. ఫలితంగా క్యాలరీలు పేరుకుంటాయి. క్రమంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుంటుంది. అది మొదలైతే తగ్గడం చాలా కష్టం. కాబట్టి ట్రిమ్‌గా ఎదిగేలా పిల్లల్ని పెంచండి. ఆరోగ్యవంతమైన సంతానాన్ని సమాజానికి అందించాలి.
పిల్లలు పిజ్జా, బర్గర్‌ తదితర జంక్‌ఫుడ్‌లపై విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. పిల్లలు ఇంతగా ఈ తరహా తిండికి అలవాటు పడటానికి సోషల్‌ మీడియా కూడా కారణమని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో చేపట్టిన ఓ సర్వే వెల్లడించింది. జంక్‌ఫుడ్‌కు సంబంధించి ఫేస్‌బుక్‌ తదితర సోషల్‌ సైట్లలో మార్కెటింగ్‌ ఎక్కువగా వుంటుందని దీంతో వీటిపై పిల్లలు అమితాసక్తి చూపుతున్నారని సర్వే తెలిపింది. జంక్‌ఫుడ్‌, శీతల పానీయాలకు సంబంధించిన ఫేస్‌బుక్‌ పేజీలను టీనేజ్‌ పిల్లలు ఎక్కువగా లైక్‌ చేస్తున్నట్లు తేలింది. జంక్‌ఫుడ్‌ నుండి మనకు లభించేవి వంద శాతం అనవసరపు కొవ్వులు.
సాధారణంగా జంక్‌ఫుడ్‌లో ఎక్కువగా వాడే పదార్థాలు జంతు సంబంధిత నూనెలు, కొవ్వులు అధిక మోతాదులో సోడియం బేకింగ్‌ సోడా, నిమ్మ ఉప్పు వాటికి తోడు రోడ్డుమీద దుమ్ము తోడవుతుంది. వీటివల్ల చిన్న వయసులోనే గ్యాస్‌ సమస్య వస్తుంది. అందుకే చిన్న పిల్లలకు జంక్‌ఫుడ్‌ అలవాటు చేయకూడదు. ఎక్కువ ఫ్రూట్‌ సలాడ్స్‌ చేసి ఇవ్వండి.
ఏ పనిపట్లా ఆసక్తి లేకపోవడం, జీవించడమే వధా అనిపించడం.. ఇవన్నీ డిప్రెషన్‌ లక్షణాలు. ఆధునిక జీవితంలోకి అత్యంత వేగంగా వచ్చి చేరిన టెక్నాలజీలాగే, అంతే వేగంగా పెరుగుతున్న మానసిక సమస్య డిప్రెషన్‌. మారుతున్న జీవనశైలి, ఒత్తిళ్లు దీనికి ప్రధాన కారణం. మారిన జీవన శైలిలోనే వున్న జంక్‌ఫుడ్‌ మరింత డిప్రెషన్‌ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. హోటల్‌ ఫుడ్‌, జంక్‌ఫుడ్‌ వంటివాటికి అలవాటుపడితే అనారోగ్య సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటుంటే అనారోగ్యం బారిన పడకుండా తప్పించుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
ఏదేమైనా భారీకారం వున్న చిన్నారుల ఆహారపు అలవాట్ల మీద తల్లిదండ్రులే ప్రత్యేక దష్టి పెట్టాల్సి వుంటుంది. ఆరోగ్యానిచ్చే పోషక పదార్థాలకు ప్రాధాన్యత పెంచి, క్యాలరీలు అధికంగా ఇచ్చేవాటిని పిల్లకు దూరంగా వుంచాలి. ఏవో కొన్ని ఆహార పదార్థాల్ని ఇష్టంగా తీసుకుని, మిగిలినవాటిని దూరం పెడుతుంటారు చాలామంది పిల్లలు. అలా కొన్ని ఆహార పదార్థాలే తింటే శరీరానికి అవవసరమైన శక్తి అందదని పిల్లలకు తెలియజేయాలి.
బియ్యం, గోధుమలు మన ముఖ్య ఆహారం. దీంతోపాటు పప్పుదినుసులు అవసరం. పాలు, పండ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు, అన్నం సమపాళ్ళలో పిల్లల ఆహారంలో చేర్చాలి.
పిల్లలో ఎదుగుదల విషయంలో ఏదైనా తప్పు జరిగింది అంటే అది కేవలం వారి తల్లిదండ్రులు, సంరక్షకులదిగా భావించాలి. తెలియని పిల్లలకు చెప్పి చూపించాల్సిన బాధ్యత వీరికి ఉంది కాబట్టి పిల్లల ఆరోగ్యం పెద్దల చేతుల్లోనే అనేది గమనించి దానికి తగిన శ్రద్ధ తీసుకోవాల్సిందిగా వైద్య నిపుణుల సలహా.