సీఎం రేవంత్‌ వ్యాఖ్యలపై మండలి గరంగరం

On CM Revanth's comments The council is busy– ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాల్సిందే
– బీఆర్‌ఎస్‌ సభ్యుల డిమాండ్‌
– చైర్మెన్‌ పోడియం ముందు నిరసన
– రోజంతా వాయిదాలేొ సభా గౌరవాన్ని మంటగలిపారు : భానుప్రసాదరావు
– బీఆర్‌ఎస్‌కు నైతిక హక్కు లేదు : మంత్రి జూపల్లి
– పెద్దల సభను మీరే అగౌరవపరుస్తున్నారు : జీవన్‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో ఓ ప్రయివేటు చానెల్‌లో చేసిన వ్యాఖ్యలపై శాసనమండలిలో శుక్రవారం తీవ్ర దుమారం చెలరేగింది. సీఎం క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్‌ఎస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. ఇదే అంశంపై నిరసన వ్యక్తం చేస్తూ వారు నల్ల కండువాలతో సభకు హాజరయ్యారు. దీంతో సభ ప్రారంభమైనప్పటి నుంచే గందరగోళం ఏర్పడింది. కొద్దిసేపటి తర్వాత చైర్మెన్‌ పోడియం ముందు వారు నిరసన వ్యక్తం చేశారు. ‘సీఎం రావాలి, క్షమాపణ చెప్పాలి, విరు వాంట్‌ జస్టిస్‌, జై తెలంగాణ’అంటూ నినాదాలు చేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యుల నిరసనతో రోజంతా సభ వాయిదాలతోనే సాగింది. మొదటిసారి ఉదయం 10.10 గంటలకు, రెండోసారి 10.40 గంటలకు, మూడోసారి 11.33 గంటలకు, నాలుగోసారి 2.30 గంటలకు, ఐదోసారి 5.05 గంటలకు వాయిదా వేయాల్సి వచ్చింది. చివరి సారి సాయంత్రం 6.50 గంటలకు సభను చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి మండలిని శనివారానికి వాయిదా వేశారు. చైర్మెన్‌, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు ఎంత చెప్పినా బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరులో మార్పు రాలేదు. దీంతో సభను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్‌ ప్రకటించారు.
అవమానించిన సీఎం : భానుప్రసాదరావు
తాను 14 ఏండ్లుగా సభలో ఉంటున్నానని బీఆర్‌ఎస్‌ సభ్యుడు భానుప్రసాదరావు అన్నారు. చాలా మంది ముఖ్యమంత్రులను చూశానని అన్నారు. ఎవరూ ఇలా సభా గౌరవాన్ని మంటగలిపేలా, అవమానపరిచేలా వ్యాఖ్యానించలేదన్నారు. శాసనమండలినుద్దేశించి ఇరానీకేఫ్‌ అనీ, రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్లకు అడ్డాగా మారిందనడం సిగ్గుచేటని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలనీ, బేషరతుగా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సభా గౌరవాన్ని కాపాడాలని కోరారు. మండలిని అవమానించిన తర్వాత ఈ సభలో సభ్యులుగా ఎందుకుండాలని ప్రశ్నించారు. సీఎం క్షమాపణ చెప్పేంత వరకూ సభను సాగనివ్వబోమని స్పష్టం చేశారు.
నిరసన తెలిపే హక్కు బీఆర్‌ఎస్‌కు లేదు : జూపల్లి
నిరసన తెలిపే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాజ్యసభ సీట్లు ఎవరికిచ్చారో (పత్రికలో రాయలేని భాష వాడారు) తెలుసునని చెప్పారు. చట్టప్రకారమే సభ్యులుగా ఎన్నికయ్యారనీ, దాని ప్రకారమే ప్రివిలేజ్‌ కమిటీ ఉంటుందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ సభా గౌరవాన్ని దిగజార్చే విధంగా వ్యవహరించొద్దని కోరారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించాలని సూచించారు. ఇలా వాయిదా వేయడం సరైంది కాదన్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలని కోరారు. బీఆర్‌ఎస్‌ సభ్యులు సభా గౌరవాన్ని తగ్గిస్తున్నారని వ్యాఖ్యానించారు. మంత్రులు సమా ధానం చెప్పడం కాదనీ, ముఖ్యమంత్రి వచ్చి క్షమా పణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ సభ్యులు డిమాండ్‌ చేశారు. చైర్మెన్‌, మంత్రులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా వారు వినలేదు. సభను నడవనీయ కుండా చివరిదాకా నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్టు చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రకటించారు.
పెద్దల సభ అంటే ఇదేనా? : జీవన్‌రెడ్డి
ఇదేనా పెద్దల సభ అంటే అని కాంగ్రెస్‌ సభ్యుడు టి జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అన్నట్టుగానే బీఆర్‌ఎస్‌ సభ్యులు వ్యవహరిస్తున్నారనీ, సభను అగౌరవపరుస్తు న్నారని విమర్శించారు. ఈ సభలో నిరసన తెలపడం సరైంది కాదన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపాలంటూ కోరారు.
సీఎం వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ సభ్యులు ప్రివిలేజ్‌ మోషన్‌ ఇచ్చారని మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి చెప్పారు. దాన్ని ప్రివిలేజ్‌ కమిటీకి అప్పగించామన్నారు. రాజ్యాంగం ప్రకారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపాల్సిన అవసరముందని సూచించారు. నిరసన రికార్డుల్లోకి ఎక్కిందని వివరించారు. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడి నిరసన వ్యక్తం చేయాలని సూచించారు. సభ్యులు తమతమ స్థానాల్లో కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌ సభ్యుడు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు కల్పించుకుని మండలిలో ప్రివిలేజ్‌ కమిటీ లేదనీ, ఎలా పంపించారని ప్రశ్నించారు. మధుసూదనాచారి మాట్లాడుతూ మండలిని కించపరిచేలా సీఎం మాట్లాడి సభా గౌరవాన్ని బజారుకీడ్చారని అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఇలాంటి వ్యాఖ్యలు సరైనవి కాదన్నారు.