ఇక హామీల అమలుకు కౌంట్‌ డౌన్‌ షురూ అయ్యింది

– హామీలు అమలు చేసేంత వరకు వదిలేది లేదు – వెంటాడుతాం.. పోరాడుతాం
-ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు
– ఇది చిన్న విరామం మాత్రమే.. ఆ తర్వాత రెట్టించిన వేగంతో ముందుకు వెళ్తాం
– ప్రాణాలొడ్డి తెచ్చుకున్న తెలంగాణను .. దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిపాడు కేసీఆర్‌
– బాల్కొండ బీఆరెస్‌ నాయకులు, కార్యకర్తలతో బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి
 నవతెలంగాణ – కమ్మర్ పల్లి
ఎన్నో అబద్దపు హామీలతో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను  అయోమయానికి గురి చేసి  గద్దెనెక్కిందని, హామీల అమలుకు శుక్రవారం నుంచే కౌంట్‌డౌన్‌ షురూ అయ్యిందన్నాని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలన్నీ మార్చి ఏడో తారీఖు వరకు నెరవేర్చాలని, లేదంటే వెంటాడుతామని, ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారాయన. గురువారం ఎమ్మెల్యేగా మూడవ సారి ఎన్నికైన తర్వాత మొదటి సారి నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా ఆయనకు వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు..తండ్రి స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి  విగ్రహానికి పూలమలతో నివాళి అర్పించి తదనంతరం కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వేల్పూర్ బయలుదేరారు. వేల్పూర్‌లోని తన నివాసంలో తనను కలిసేందుకు పెద్ద ఎత్తున వచ్చిన బీఆరెస్‌ కార్యకర్తలు, నాయకులు, ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని పదిహేను సంవత్సరాల పాటు సుధీర్ఘ పోరాటం చేసి తీసుకొచ్చిన పార్టీ మనది. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దేశ రాజకీయాలను ఒప్పించి రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణకు ఒప్పుకోకపోతే మాకు నూకలు చెల్లవు అని చెప్పి అటు కాంగ్రెస్‌, ఇటు టీడీపీ ఇద్దరినీ కూడా రాజకీయ అనివార్యత సృష్టించి తెలంగాణకు ఒప్పించిన నాయకుడు కేసీఆర్‌ ‘అని పేర్కొన్నారు. ‘అలా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టారన్నారు. డెబ్బై లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు అతికష్టంగా పండే మన తెలంగాణలో ఈరోజు మూడు కోట్ల మెట్రిక్‌ టన్నుల వడ్లు పండించే స్థాయికి తెలంగాణను  కేసీఆర్‌ తీసుకువెళ్లాడన్నారు. ఏ ఊరు చూసిన, ఏ గల్లీ చూసినా అనేక మార్పులు, యాభై ఏండ్లలో చేయని అభివృద్దిని తొమ్మిదిన్నర ఏండ్లలో చేసి చూపిన  నాయకుడు కేసీఆర్‌ అని అన్నారు. కరెంటు కోసం కష్టాలు పడ్డ మనకు 24 గంటల కరెంటు ఇచ్చాడని, చెరువులను గంగాళంలా మార్చి బోర్లలో నీళ్లు తెచ్చింది కేసీఆర్‌ అని పేర్కొన్నారు. రైతు ప్రతీ సీజన్‌లో మందు సంచులు, విత్తనాలు కొనాలన్నా సావుకారుల వద్దకు బాకీల కోసం తిరిగే రైతులకు ఇవాళ ఆ అవసరం రాకుండా ప్రభుత్వమే రైతుకు ఎకరాకు పదివేల పెట్టుబడి ఇచ్చే విధానాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది  కేసీఆర్ అని గుర్తు చేశారు.  పేదలకు రెండు వందల పింఛన్‌ను రెండువేలకు పెంచి ఇచ్చాడని,  దేశంలో ఎక్కడా ఇది లేదన్నారు.  ఆడబిడ్డ పెండ్లయితే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా లక్ష రూపాయల కల్యాణలక్ష్మీ చెక్కులందించాడన్నారు. సొంత ఇంటిలా పట్టించుకుని రాష్ట్రాన్ని కేసీఆర్‌ కాపాడుకున్నాడని, కాంగ్రెస్‌ పార్టీ అబద్దపు ప్రచారాలు, రెండు సార్లు చేసిండ్రు కదా ఒక్కసారి మాకేయిండ్రు అని సింపతి కొట్టేడయంతో పాటు కేసీఆర్ మీద, తననామీద, తన కుటుంబం మీద అసత్యపు ఆరోపణలు చెప్పిందే వంద సార్లు అబద్దాలు చెప్పి ప్రజలు అయోమయానికి గురిచేశారన్నారు. అలవికాని హామీలు చాలా ఇచ్చారన్నారు. దానికి కూడా ప్రజలు కొంతమంది అవునేమో అవుతదేమో చూద్దాం అనే భ్రమలో పడిపోయి రాష్ట్ర స్థాయిలో వారికి ఓట్లేశారన్నారు. ఓట్లు రెండు శాతమే  రెండు పార్టీలకు తేడా, రెండు శాతం తేడాతో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో అధికారాన్ని చేజిక్కించుకుందని అన్నారు.  ఆరు గ్యారెంటీలు అమలు చేసేదాక ప్రజల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందని,  ఎవరు కుంగిపోవనవసరం లేదన్నారు. పదివేల రైతుబందు ఇస్తుంటే పదిహేను వేలిస్తామన్నారు. ఇప్పుడు సీజన్‌ స్టార్ట్‌ అవుతున్నది చూద్దాం, ప్రతిపక్ష పార్టీ, నాయకులుగా మనమందరం కూడా ఏం చేస్తరో చూద్దామన్నారు. చేయకపోతే వెంటపడి చేపించాల్సిన బాధ్యత కూడా మనదేనన్నారు. రెండు లక్షల రుణమాఫీ అన్నరు..మూడు నెలలనే చేస్తామన్నారు.. రేపటి నుంచి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌, తొంభై రోజుల్లో మార్చి ఏడో తారీఖులోపల రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్‌ ప్రభుత్వం చేయాల్సిందేనని స్పష్టం చేశారు. కౌలు రైతులకు కూడా చేస్తామన్నారుని గుర్తు చేశారు. వరికే కాదు వాళ్ల హామీలో అన్ని పంటలకు బోనస్‌ ఇస్తామని హామీలిచ్చారని, పసుపుకు పన్నెండు వేల మద్దతు ధర ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఎర్రజొన్నకు కూడా రేటు 3500 ఇప్పిస్తామన్నారు. పన్నెండు వేలు పసుపుకు , వరికి ఐదొందల బోనస్‌ ఇవ్వకపోతే వెంటపడి ఇప్పించాలి. ప్రతిపక్ష నాయకుడిగా రైతులు, ప్రజల పక్షాన ఉండి పోరాటం చేసి చెప్పిన ధరను ఇచ్చేదాక వెంటపడాలెనన్నారు. మహిళలకు కూడా బస్సు ఫ్రీ అన్నరు.. కరెంటు బిల్లు కూడా కాంగ్రెసే కడతదన్నారు,  లక్ష కల్యాణలక్ష్మీతో పాటు తులం బంగారం, సిలిండర్ ఐదొందలన్నారు..రేపటి నుంచే అమలు చేస్తామన్నారుని గుర్తు చేశారు.ఇది కొంచెం విరామం, స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే ఇంతకు రెట్టింపు వేగంతో వెళ్తామన్నారు. హామీలు జరుగుతున్నవా లేదా ప్రజల్లో చర్చకు పెట్టాలని,  యాక్టివ్‌గా ఉండాలన్నారు. అధర్మంతోటి, మోసంతోటి, అన్యాయంతోటి ఓట్లు వేయించుకున్నోళ్లు ఎక్కువ కాలం ఉండరని, కొద్ది రోజులు వెయిట్ చేయాలని కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.