దేశానికి క్యాన్సర్ పెను సవాలుగా మారింది

నవతెలంగాణ-కంఠేశ్వర్ : సర్వేకల్ క్యాన్సర్ దేశానికి ముఖ్యమైన ప్రజారోగ్య సవాలుగా మారనున్నదని, దీనిని నివారించడానికి ప్రభుత్వం , సామాజిక సేవా కార్యకర్తలు, కృషి చేయాలని ప్రముఖ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రోహిత్ అన్నారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా దాస్ నగర్ లోని మహిళ రెసిడెన్షియల్ కాలేజ్ లో మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన క్యాన్సర్ అవేర్నెస్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. క్యాన్సర్ నివారణ కు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలని, మందుల ధరలను నియంత్రించాలని, అప్పుడే నానాటికి పెరుగుతున్న క్యాన్సర్ ను అరికట్టవచ్చు అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక జాతీయ అధ్యక్షులు డాక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ తాను క్యాన్సర్ని జయించానని, ముందుగా గుర్తించి క్యాన్సర్ని అరికట్టవచ్చని ఆయన అన్నారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ప్రమాదకరంగా మారాయని వాటిని ముందుగా గుర్తించి నివారించుకోవచ్చని, ప్రభుత్వం ఉచితంగా క్యాన్సర్ వ్యాక్సినేషన్ మహిళలకు అందించాలని ఆయన కోరారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకు జిల్లాలో ఇందూరు క్యాన్సర్ ఆసుపత్రి సహకారంతో అనేక క్యాంపులు నిర్వహించామని, విద్యార్థులు అయిన మీరు గ్రామాలలో మీ తల్లిదండ్రులకు, సమాజానికి క్యాన్సర్ ప్రమాదాన్ని గురించి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. కాలేజీ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరావు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ నందు ఆల్ పెన్షనర్స్& రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు కే రామ్మోహన్రావు , మదన్మోహన్, ఈవిల్ నారాయణ, అద్దంకి ఉషాన్, కళాశాల సిబ్బంది, అత్యధికంగా విద్యార్థులు పాల్గొన్నారు.